Tuesday 16 July 2013

అందరూ మనుషులే..!





రోజు లాగే ఆ రోజు కూడా రజని ఉదయాన్నే లేచి పిల్లలకు పాలిచ్చి, స్కూలుకు రడీ చేస్తుండగా, పలు ఊళ్ళు తిరిగే ఉద్యోగి  అయిన తన భర్తకి అర్జంటుగా పక్కఊరు రావాలని ఫోను వచ్చింది.  నేను వచ్చేసరికి బాగా పొద్దుపోతుంది, జాగ్రత్త..  అని చెప్పి రెడీ అయ్యి బయలుదేరుతున్నాడు.  ఈలోగా, విధవరాలైన వాళ్ళ పనిమనిషి కాంతం ఎదురొస్తుంది. మడి,ఆచారాలు బాగా పాటించే రజనీ, తన భర్తని ఇంట్లోకి లాక్కొని వస్తూ, "ఏమే కాంతం విధవరాలివి కదా, అలా ఎదురురాకపొతే కాసేపు పక్కన ఉండవచ్చు కదా, వెధవ శకునం, వెధవ శకునం" అని తిట్టి, తన భర్తని మంచి నీళ్ళు తాగి వెళ్ళండి అని విసుక్కొంది. "నువ్వూ.. నీ చాదస్తం" అని భర్త విసుక్కొని నీళ్ళు తాగి వెళ్ళాడు.

వర్షాకాలం కావడంతో, జోరుగా వర్షం మొదలైంది. పిల్లల్ని స్కూలునుండి ఇంటికి తీసుకొచ్చే సమయం అవ్వడంతో, స్కూలుకి బయలుదేరింది రజని. దారిలో వర్షం బాగా పెరగడంతో,ఒక పక్కన ఆగింది.

స్కూలుకు దగ్గర్లోనే పనమ్మాయి ఇల్లు కావడంతో, ఎలాగో ఇప్పుడు కాంతం ఆంటీ మా ఇంటికి వెళ్తుంది కదా, పోనీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి కాంతం ఆంటీతో కలసి మా ఇంటికి వెళ్తాను అని అనుకొంటూ పాప పనిమనిషి కాంతం ఇంటికి వెళ్ళింది. అప్పుడు కాంతం, "బాగా వర్షం పడుతుంది కదమ్మా.. కాసేపాగి వెళ్దామా?" అని అంది. పాప సరే..  అని "మరి నాకు ఆకలేస్తోంది" అని అంది. అప్పుడు కాంతం, "అయ్యబాబోయ్ మేమేదైనా నీకు పెడితే మీ అమ్మ ఊరుకుంటుందా?," అని అంది. ఇంతలో, పాప కాంతం ఇంటికి వెళ్ళిందని, స్కూలు గేట్ మేన్ ద్వారా తెలుసుకొన్న రజనీ, కాంతం ఇంటికి వెళ్ళింది. మడి,ఆచారాలు మంట కలిపిందని పాపని తిట్టి, ఇంటికి తీసుకెళ్ళిపోయింది.

వర్షంలో తడచిన పాపకి బాగా జలుబు చేసి, జ్వరం వచ్చింది. భర్త వచ్చాక ఆసుపత్రికి తీసుకువెళ్దాం అనుకొన్న రజనికీ, "భర్తకి పని అవ్వలేదు, రేపు బయలుదేరతాడు" అని భర్త నుండి ఫోను వచ్చింది. పాపకి జ్వరం బాగా పెరిగిపోతోంది, పోనీ తను తీసుకెళ్దాం అంటే కుండపోతు వర్షం. "అయ్యో దేవుడా.. ఏం చెయ్యను?" అని ఏడుస్తుండగా, అంట్లు తోమడానికని వచ్చిన కాంతం, రజనీ ఏడవడం గమనించి, "ఏందమ్మా అట్టా ఉన్నారు?" అని అడిగింది.
ఇంక తన మడి గిడి అన్ని వదిలేసి గబ గబా కాంతాన్ని పట్టుకొని ఏడుస్తూ, "పాపకు బాగా ఒళ్ళు కాలిపొతుందే.. సమయానికి అయ్యగారు కూడా ఊర్లో లేరు, నాకు ఏంచెయ్యాలో తెలియట్లేదే" అని అంది. అది విని వెంటనే  కాంతం, "నేను ఒక డాటరమ్మగారింట్లో పని సేత్తానండి. ఆవిడ సెయ్యి చాలా మంచిది, అక్కడికి తీసుకు వెల్దామా?" అని అడిగింది. బాగా వర్షం పడ్తుంది కదే అని అంది రజని. "అదంతా మీకెందుకండి? నే తీసుకెళ్తాగా !" అని అంది.

ఆ వర్షం లోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక రిక్షాని తీసుకొచ్చి, ఆ రిక్షాలో పాపని,తల్లిని ఎక్కిచుకొని ,డాక్టరమ్మ దగ్గరకి తీసుకెళ్ళి  వైద్యం చేయించి, మందు బిళ్ళలు తీసుకొచ్చి, మళ్ళీ అదే రిక్షాలో ఇంటికి తీసుకొచ్చి దించి, "ఇక తగ్గిపోద్దిలెమ్మ,భయపడకు...  ఇక నేను వత్తానమ్మ పిల్ల ఒక్కర్తే ఉందీ.. ఎలాఉందో ఏటోనమ్మ?" అని వెళ్లబోతుంటే, రజని ఆపి, " పోనీ మీ అమ్మాయిని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చైవే ఎలాగో అయ్యగారు కూడా లేరు కదా..!" అని అంది. "మరి మీకు మడీ అవి ఉన్నవి కదమ్మ.." అని అడిగింది కాంతం.

"మనిషి కన్నా మడి,ఆచారాలు గొప్పవి కాదని తెలియ చేసాడే దేవుడు..!" అని చెయ్యి పట్టుకొని కన్నీరు కార్చింది రజని.

"మనిషిని మనిషిగా చూడటం...  ఒక మనిషిగా, ప్రతి మనిషిలో ఉండవలసిన మొదటి లక్షణం..!".






      

Friday 12 July 2013

"దేనికైనా శ్రద్ధే ముఖ్యం..."


 

 

స్వామి వివేకానంద చదువుకునే రోజుల్లో ఒకసారి జరిగిన సంఘటన... 

 

నరేంద్రుడికి పుస్తకాలు చదవటం అంటే ఎంతో ప్రియం. రోజూ కళాశాల లైబ్రరీ లో నుంచి పుస్తకాలు తీసుకెళ్ళేవాడు. అయితే, రోజూ ఒక కొత్త పుస్తకాన్ని తీసుకెళ్ళి, మరుసటి రోజు దాన్ని ఇచ్చేసి, మళ్ళీ ఒక కొత్త పుస్తకాన్ని తీసుకెళ్ళేవాడు. అక్కడ పని చేసే లైబ్రేరియన్, ఇదంతా గమనించి, ఒక రోజు నరేంద్రుని ఆపేసి, "ఏం బాబు, రోజూ ఒక పుస్తకం తీసుకెళ్తున్నావ్, ఇదేమైనా ఆటగా ఉందా ?, అసలు తీసుకెళ్ళిన ఒక పుస్తకం అయినా పూర్తి చెయ్ ముందు, ఇవాళ కొత్తది ఇవ్వను.. " అన్నాడు. బదులుగా నరేంద్రుడు, "లేదండి, ఈ పుస్తకాన్ని చూసేసాను పూర్తిగానే, నాకు కొత్తది కావాలి, దయచేసి ఇవ్వండి. " అని అడిగాడు. అప్పుడు ఆ లైబ్రేరియన్, "ఓహో..ఆ పుస్తకం పూర్తయిందా?,, సరే.. ఆ పుస్తకం ఇలా ఇవ్వు, నేను అడిగిన దానికి సమాధానం చెప్తే ఇవాళ నీకు వేరే పుస్తకం ఇస్తాను, లేదంటే ఇంక ఇవ్వను మరి.. " అన్నాడు. అప్పుడు నరేంద్రుడు, చిరు మందహాసం తో సరే అన్నాడు. 


ఆ లైబ్రేరియన్ మధ్య మధ్య పేజీలు తిప్పుతూ, నరేంద్రుని కొన్ని ప్రశ్నలు వేసాడు. అసలేమి తడుముకోకుండా అన్నిటికి నరేంద్రుడు టక టకా సమాధానాలు ఇవ్వటమే కాకుండా, అది ఎందుకో అని కూడా చెప్పేసాడు. ఇంక, ఆ లైబ్రేరియన్ కి ఆశ్చర్యమేసింది, అతని సమాధానాలకి ముచ్చటేసి, "బాబు.. ఈ పుస్తకాన్ని నిజంగానే నువ్వు పూర్తి చేసావ్, కానీ, రోజూ అన్నిటినీ కూడా ఇలాగే పూర్తి చేస్తున్నావా? " అనడిగాడు. "అవును చేస్తున్నాను, సందేహం ఉంటే మీరు అందులోంచి కూడా అడగవచ్చు.." అని చెప్పాడు నరేంద్రుడు విశ్వాసంగా. "ఇదంతా ఎలా సాధ్యం ?.. ఒక రోజులో ఒక పుస్తకం పూర్తి చేయటం మామూలు విషయం కాదు, కానీ, ఇది నీకెలా సాధ్యం అయింది?అనడిగాడు ఆ లైబ్రేరియన్. దానికి నరేంద్రుడు, "పుస్తకాన్ని అందరూ చదువుతారు, నేను చదవను, ప్రతి అక్షరాన్ని లోతుగా చూస్తాను.. ధ్యాస అంతా అందులో ఉన్నపుడు, వేరే ఆలోచన ఏదీ లేనప్పుడు, మనం చూసే ప్రతి అక్షరం సూటిగా మనల్ని తాకి, మనలోనే ఉండిపోతుంది.. పుస్తకం ఒకటనే కాదు, చేసే ఏ పనైనా శ్రద్ధ ఉన్నపుడు, ఆటకం ఉన్నా అది కంటకం కాదు.. దేనికైనా శ్రద్ధే ముఖ్యం..." అని చెప్పి కొత్త పుస్తకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక కొత్త అనుభవం ఆనందమై, ఇతని గొప్పతనం అతని విశ్వాసంలోనే ఉంది అనుకుని, వెళ్తూ ఉన్న కాంతి కిరణాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు లైబ్రేరియన్. అప్పటినుంచి, కొత్త పుస్తకాలు ఇవ్వటమే కాదు, ప్రత్యేకించి కొన్ని పుస్తకాలను నరేంద్రుని కోసం తెప్పించేవాడు కూడా.


"ఫ్రెండ్స్... వివేకానందుడు అంత గొప్ప వాడు అయ్యాడు అంటే, అది ఆయన జీవించిన విధానం, ఆయన అనుసరించిన మార్గం, ఉపదేశించిన ఆదర్శం.. ఆయన జీవితంలోని విశేషం, మనకు ఎంతో స్ఫూర్తి దాయకం...!"










Tuesday 2 July 2013

"అమ్మ..."


 

ఒక లేగదూడ, పరుగుపరుగున అమ్మ ఆవు దగ్గరికి వెళ్తూ ఉండగా, కాలు జారి పడిపోయింది, చిన్న గాయమైంది దూడ కాలికి. తల్లి ఆవు, అది చూసి, పరిగెత్తుకొచ్చి దూడని అక్కున చేర్చుకుని, గాయమైన చోట మెల్లిగా నిమురుతూ ఉంది. దూడ నొప్పితో, "అమ్మా..." అనగానే, తల్లి ఆవు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 


దూడ అది గమనించి, తల్లిని ఆనుకుని, "అమ్మా.. నొప్పి నాకైతే, నువ్వెందుకు ఏడుస్తున్నావు?" అని అంది. "నా ప్రాణం నుంచే పుట్టావు కదా తల్లీ, నీకు నొప్పిగా ఉన్నంతసేపూ నాకూ బాధగానే ఉంటుంది", అని తల్లి ఆవు అంది. అప్పుడు దూడ, "అమ్మా.. మరి నువ్వు నన్ను నీ కడుపులో దాచి మోసినప్పుడు, నీకు బరువనిపించలేదా?.." అమాయకంగా అడిగింది. దానికి తల్లి ఆవు, "లేదు తల్లీ, నా చిట్టి తల్లివి నువు  కడుపులో ఉన్నావు కదా అని మనసు తేలిక పడి, బరువంతా దిగిపోయేది" అంది.   


దూడ, "అమ్మా.. మరి నేను ఆటలాడుతున్నా, నిద్ర పోతున్నా, ఏం చేస్తున్నా, నన్నే కనిపెట్టుకుని ఉంటావు కదా, నీకు అలసటగా అనిపించదా.." అని అడిగింది. అప్పుడా ఆవు, "నా తల్లీ, నిన్ను ఎంత సేపు చూసుకున్నా నాకు తనివి తీరదు, ఇంక అలసట ఎలా ఉంటుంది చెప్పు?" అంది. చివరిగా, ఆ లేగ దూడ ఇలా అడిగింది, "అమ్మా.. ఇంత కష్టపడీ పెంచుకుంటావు, మరి రేపు నేను పెద్దయ్యాక నా దారిన నేను వెళ్లిపోతాను కదా.. అప్పుడైనా నీకు నాపై కోపం రాదా చెప్పమ్మా.." అని. ఆ ప్రశ్నకి తల్లి ఆవు నవ్వి, దూడని ఇంకా దగ్గరగా అలుముకుని, "తల్లీ, నువు పెద్దయ్యాక, నువ్వు నన్ను వదిలిపోయినా, నీ ఎదుగుదలని నేను గమనిస్తూనే ఉంటాను, నువ్వు ఎదుగుతుంటే నేను ఆనందపడతాను. ఒక తల్లిగా నీ సంతోషం తప్ప నీ నుంచి కోరుకునేందుకు ఏమీ ఉండదు." అన్నది. ఆ మాటలు విని, "అమ్మా..  ఏమిచ్చినా నీ రుణం తీరదు కదా.." అని మనసులో అనుకుని, తల్లికి దగ్గరగా ముడుచుకుని నిదురపోయింది. తల్లి ఆవు ఇంకా ఆ దూడని నిమురుతూనే ఉంది.   



సృష్టి కి మూలమే "అమ్మ"... ఏ బిడ్డ కోరేదైనా ఆ తల్లి ఒడినే కదా...
ఏ తల్లి కోరికైనా ఆ బిడ్డ క్షేమమే కదా... ఆ చల్లని "అమ్మలకు" బిడ్డల ప్రియమైన వందనం. 



Saturday 29 June 2013

వెంగళప్ప పందెం కాచాడోచ్...





కిరణ్, వెంగళం ఇద్దరూ ఫ్రెండ్స్. ఒకసారి, ఈ వెంగళప్ప ని ఆట పట్టిస్తూ కిరణ్, "ఒరే నువు నిజంగా వెంగళప్పవే రా..." అన్నాడు. దానికి, వెంగళానికి చాలా కోపమొచ్చింది. "ఊహు.. నేనేమి వెంగళప్పని కాదు, నా పేరు మాత్రమే వెంగళం.." అన్నాడు మూతి ముడుచుకుని. అప్పుడు కిరణ్, "అయ్యో..! సన్నాసీ, కావాలంటే నీకు నిరూపిస్తాను చూడు" అని చెప్పి, "సరే ఒక పందెం కాద్దామా?..." అనడిగాడు.  


సరే అన్నాడు వెంగళం. కిరణ్ ఇలా చెప్పాడు, "పందెం ఏంటంటే, నేను నీకు ఒక అమ్మాయిని చూపిస్తాను, నువు గనక ఆ అమ్మాయిని నెలరోజుల్లో ప్రేమలోకి దింపితే, నువు వెంగళప్పవి కావు, అలా కాకుండా, ఆమె నిన్ను కాదంటే నువు వెంగళప్పవే.." అన్నాడు. "సరే, ఆ అమ్మాయిని చూపించు, ఇట్టే పడేస్తా..." అన్నాడు వెంగళం హుషారుగా.   


ఆ అమ్మాయిని చూపించి, ఆమె పేరు ప్రియ అని చెప్పి, నెల రోజుల తర్వాత కలుద్దాం అని వెళ్ళిపోయాడు కిరణ్. 


ఇంక మన వెంగళం రంగం లోకి దూకాడు, వెనకాల మ్యూజిక్ తో, "ఈ దూకుడూ... సాటెవ్వడూ" అని. ఆ అమ్మాయిని గమనిద్దాం ఏయే టైం లో ఎక్కడుంటుంది అని, స్కెచ్ వేసి, ఒక చార్ట్ తయారు చేసుకున్నాడు. ఉదయం.. 9 గంటలకి, అమ్మోరి గుడిలో... ప్రియ గుడికొచ్చింది. ఆమె కొబ్బరి కాయ తీస్కుంది. వెంగళమూ కొబ్బరికాయ తీస్కున్నాడు. ఆమె కొబ్బరికాయ పగులకొట్టి, దండం పెట్టింది. మన వాడూ, కొబ్బరికాయ కొట్టాడు. పాపం  దండం పెట్టుకుందాం అనుకునేసరికి వెంగళం చెంప ఛెళ్ళుమంది. ఏమైందా అని చూస్తే, ఎదురుగా ప్రియ, "వెధవ,,, కొబ్బరికాయ చూసి కొట్టలేవా?.. నా తల పగులకొట్టావ్.." అంటూ రుసరుసగా వెళ్ళిపోయింది. బిక్క మొహమేసి, "ప్రియా... నన్ను క్షమించు ప్రియా... " అని లోలో అనుకుని తానూ వెళ్ళిపోయాడు. 

 

తరువాత రోజు సాయంత్రం 6 గంటలకి... ప్రియ కాఫీ షాపుకి వచ్చింది, ఒక కాఫీ ఆర్డరు చేసింది. వెంగళమూ కాఫీ ఆర్డరు ఇచ్చాడు. ఆమె ముందు కొంచం బిల్డప్ ఇద్దామని, బేరర్ కాఫీ తెస్తుంటే, "ఇదిగో చిన్నా.. నీకెందుకు శ్రమ? కాఫీ నేను తెచ్చుకుంటాలే.. " అని వెళ్లి కాఫీ తెస్తుండగా, అది కాస్తా ప్రియ పై పడి, ఆమె డ్రెస్ అంతా పాడయింది. ఇంకేముంది, వెంగళం చెంప మళ్ళీ పగిలింది. 

 

"ఒరే వెధవ.. బేరర్ ఉండేదే సర్వు చేయటానికి.. ఇలా నువ్వు తెచ్చుకుని పక్కనోళ్ళను కాఫీ లో ముంచటానిక్కాదు.. ఛీ, మంచి డ్రెస్సు నాశనం చేసాడు యెదవ.. " అని మళ్ళీ కోపంగా వెళ్ళిపోయింది. వెంగళం ఇంకా షాకు నుండి తేరుకోలేదు... 

 

ఇలా రోజూ ఏదో ఒక విధంగా ప్రియ దృష్టిలో పట్టానికి ఏదో చేసి, అది ఇంకేదో అయ్యి, మొత్తంగా 29 చెంపదెబ్బలు తిన్నాడు. ఇక చివరి 30 వ రోజు, ఇంక లాభం లేదని, డైరెక్ట్ గా "ఐ లవ్యూ.." చెప్పేద్దామని, ఒక రోజా పువ్వుతో, ఆమె పక్కింటి పిట్ట గోడ మీద నిలబడ్డాడు. ప్రియ వచ్చింది. ఆమెకు పువ్వు ఇద్దామన్న తొందరలో, ఎగిరి ఆమె కాళ్ళ ముందు పడ్డాడు. కాళ్ళకి మెట్టెలున్నాయి, ఎవరోలే అనుకుని లేచాడు. లేచేసరికి చెంప మళ్ళీ మోత మోగింది. ఈసారి ఎదురుగా ఎవరో ఒకతను ఉన్నాడు, "ఏవండి.. నేను చెప్పా కదా నెల్రోజులుగా రోజూ ఒకడు నన్ను బాగా టార్చర్ పెడుతున్నాడని.. వీడే వాడు.. " అంది ప్రియ. "ప్రియ.. నీకు పెళ్లయిపోయిందా? ఎప్పుడు ?.." అన్నాడు షాకులో షేక్ అయిన వెంగళం. "పెళ్లయిపోయిందా ఏంట్రా వెధవ ?.. ఇద్దరు పిల్లలు కూడా ఉంటే.. ఈసారి మళ్ళీ కనపడితే చంపేస్తాను వెధవ " అని కోపంగా ప్రియ వాళ్ళ ఆయనతో వెళ్ళిపోయింది. 

 

అప్పుడే అక్కడికొచ్చి అంతా చూస్తూ ఉన్న కిరణ్, ఫక్కుమని నవ్వాడు. వెంగళం కోపంగా కిరణ్ దగ్గరికొచ్చి, "ఒరే.. ఇది చీటింగ్ రా.. ఆ అమ్మాయికి ముందే పెళ్లి అయిపొయింది.. నీకు తెలిసీ నాకు ఆ అమ్మాయిని చూపించావు కదా.. " అన్నాడు. అప్పుడు కిరణ్, "నీ మొహం.. నేను చూపించినప్పుడే ఆవిడ వాళ్ళ ఆయన, ఇద్దరు పిల్లలతో నే ఉంది. నువ్వు చూళ్ళేదా?" అన్నాడు. 

 

అప్పుడు వెంగళం, "అవునా.. ఏమో? ఎలాగైనా పందెం గెలవాలని ఆ అమ్మాయి పైనే ఫోకస్ చేసారా.." అన్నాడు. "హ హ్హ హ్హ అందుకేరా, నిన్ను వెంగళప్ప అన్నాను... " అని వెళ్ళిపోయాడు కిరణ్. "హ్మ్... జగమే మాయ.. బతుకే మాయ..." అని పాడుకుంటూ బిక్క మొహమేసాడు వెంగళం.

 

 

 

 

 

 

Friday 28 June 2013

"సాయం..."





ఉదయం 11 గంటలయ్యింది, రోడ్డు అంతా రద్దీగా ఉంది. నిదానంగా అడుగులో అడుగేస్తూ, ఒక డెబ్భై యేళ్ళ పండు ముసలమ్మ, చేతిలో ఒక కర్ర సాయంతో నడవలేక నడుస్తూ, మధ్య మధ్య కాస్త సేదదీరుతూ, వస్తోంది మెల్లిగా. 

దారిలో ఒకతను స్కూటరుపై వస్తుండటం గమనించి, అతణ్ణి ఆపి, "ఇదిగో అయ్యా.. ముడు కాళ్ళ ముసలిదాన్ని, నడవలేకపోతున్నా, కాస్త నన్ను మా ఇంటి దాకా దింపుతావా, యాతన గా ఉంది, నీకు పుణ్యం ఉంటుంది... " అని అడిగింది. దానికతను, "యేవమ్మో.. పొద్దున్నే నేనే దొరికానా నీకు, నిన్ను దింపుకుంటూ ఉంటే, నా పనులెవరు చేస్తారు?, ఇంకెవరినైనా అడుగు పో పొవమ్మా.. " అని వెళ్ళిపోయాడు. 

ఆ ముసలమ్మ పాపం నడవలేక ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎవరు ఆమెకు సాయం చేయటానికి రాలేదు. చాలా మందిని అడిగింది. ఇంత బిజీగా ఉన్న సిటీలో ఎవరి పని వారిదే. ఆమె అసహాయతని అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. 

కానీ, ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉన్నాడు  ఓ 25 ఏళ్ల అబ్బాయి. అతని పేరు సుధీర్. ఉద్యోగానికి వెళ్తూ బస్ స్టాపులో ఎదురు చూస్తున్నాడు బస్సు కోసం. ఆ ముసలమ్మకి అసలు సమస్యేమిటో కదా?, వెళ్లి ఓసారి కనుక్కుందాం అని ఆమె దగ్గరికెళ్ళి, "అమ్మా..! ఎవరు మీరు ? మీకేం కావాలి?" అని అడిగాడు. ఆ ముసలమ్మ, "నేను నడవలేను, ఇంటిదాకా నాకు సాయం రమ్మంటే ఎవరూ రావటం లేదయ్యా..." అని చెప్పింది. "అయ్యో! అవునా.. ఎక్కడికెళ్ళాలి, పదండి నేను తీసుకెళ్తాను.. " అన్నాడు సుధీర్. "వద్దులే బాబు, నువ్వు కూడా ఏదో తొందరలో ఉండి ఉంటావ్, నేనే ఎలాగోలా పోతాలే... " అంది ఆ ముసలమ్మ. 

"ఏం ఫరవాలేదమ్మా! మహా అయితే నాకు కొంచం ఆలస్యం అవుతుంది అంతే.. పద నేను తీసుకెళ్తాను" అని ఆమెకి తోడుగా సాయం అందించి తీసుకెళ్ళాడు ఆమె ఇంటికి. అది ఒక పూరి గుడిసె.. అందులో నలుగురు వికలాంగులైన పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసి ఆమెని అడిగాడు,"అమ్మా ! ఎవరు వీళ్ళంతా... ?" అని. అప్పుడా ముసలమ్మ, "వీళ్ళంతా తల్లి దండ్రులు వదిలేసిన పిల్లలు.. నాతో పాటే వీళ్ళకీ ఇంత కూడు పెడదామనే నేను పుల్లలమ్మి వస్తున్నా.. దారిలో అలసిపోయి సాయం కోసం అడిగానయ్యా... " అని చెప్పింది. అప్పుడు సుధీర్, "నీకు ఏమి కాని వాళ్ళ కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావా ? నీకే కష్టం కదమ్మా" అన్నాడు. 

అప్పుడా ముసలమ్మ, "లేదయ్యా!, పాపం పసివాళ్ళు వీళ్ళు, రోడ్డున పడి ఉన్న వీళ్ళని చూసి వదల బుద్ధి కాలేదు, నా కొడుకూ ఉండే వాడు, ఇలా వికలాంగుడై చనిపోయాడు. వీళ్ళలో నా కొడుకుని చూసుకుంటూ బతుకుతున్నా, అయినా ఏమి కాని దాని కోసం నువ్వూ సాయానికి వచ్చావుగా... సాయం చేసినోల్లకు దేవుడు మంచే చేస్తాడు.. నువ్వు నా కొడుకు లాంటి వాడివే, ఇదిగో ఓ ముద్ద తిను.. " అని అన్నం కలిపి పెడుతుంటే, సుదీర్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 

అప్పటినుండి ఆ ఇంటికి రోజూ వెళ్ళేవాడు సుధీర్, ఆ సాయం లో తానూ ఓ భాగం అయ్యాడు. 

"కుటుంబంలో ఒక్కరు ఆకలితో ఉన్నా తట్టుకోలేని మనుషులున్న సమాజంలో, రోడ్డున పడి ఉన్న అనాదలకు ఒక పిడికెడు అన్నమైనా వేయలేని నిర్లక్ష్యం కూడా ఉంది.. నిస్సహాయులైన వారికి అందించే సాయం, సూటిగా భగవంతుని చేరుతుంది అంటారు.. అటువంటి ఆదుకునే మనసున్న ప్రతి మనిషికి వందనం..."

 

 

 

 

 

Wednesday 26 June 2013

"దేవుడంటే సాయం.."






ఆనంద రాజు పరమ భక్తుడు. కుటుంబంతో కలిసి తీర్థ యాత్రకు వెళ్ళాడు, భగవంతుని సందర్శించుకుని, తిరుగు ప్రయాణం అవుతూ నది దాటుతుండగా... ఒక్కసారిగా నది ఉధృతి పెరిగింది, వరదలా పొంగింది. వీళ్ళ బస్సు ఆ లోయల్లో చిక్కుకుపోయింది. ఆ చోట మాత్రమే కాదు, ఆ తీర్థస్థలం చుట్టురా ఉన్న ఊళ్లల్లోకి నీళ్ళు నిండి, అంతా నీటి మయం అయిపోయింది. అంతవరకూ, నిర్మలంగా ఉన్న ఆ లోయల అందాలు, ఒక్కసారిగా భయంకరంగా మారిపోయాయి. 

బస్సులో ఇరుక్కుపోయిన ఆనంద రాజు, అంతా ఆ భగవంతునిపై భారం వేసి, దేవుణ్ణి తలుస్తూ ఉన్నాడు. ఇంతలో, రక్షణ సిబ్బంది వచ్చారు, హుటాహుటిన అందర్నీ కాపాడే పనిలో మునిగి పోయి ఉన్నారు. ఆ సిబ్బందిలో ఒక జవాను ఉన్నాడు, పేరు బద్రీనాథ్. పరమ నాస్తికుడు. కానీ, భక్తుల్ని కాపాడుతూ, తన రక్షణ బాధ్యతని పూర్తిగా మనసుతో నిర్వహిస్తున్నాడు. 

ఆనంద రాజు, అందర్నీ గమనిస్తూ ఉన్నాడు. కొందరు దేవుడా, దేవుడా అని వేడుకుంటున్నారు. కొందరు భయపడుతూ, ప్రాణాలు అరచేత బట్టి కదలక ఉండిపోయారు, కొందరు ఆ దేవుణ్ణే నిందిస్తున్నారు, "నీ దర్శనానికి వచ్చిన వాళ్ళనే శిక్షిస్తున్నావా?.." అని. కొందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, బంధువుల రోదన... గాయాలైన వారి ఆర్తనాదాలు... ఇలా అన్నీ. 

ఇంతలో, కొన్ని పార్టీల రాజకీయ నాయకులు వచ్చారు. అక్కడైనా, ఒక మనిషి ప్రవర్తన లేదు వాళ్ళలో. ఒక్కర్నీ కాపాడింది లేదు, కానీ, మా పార్టీ అంటే మా పార్టీ గొప్పదని పోట్లాడుకుని, బాధితులను ఆనుకుని నాలుగు ఫోటోలు , రెండు వీడియోలు తీయించుకుని వెళ్ళిపోయారు. 

ఇంక, బద్రీనాథ్ కొందరితో కలిసి వచ్చాడు, ఆనందరాజు ఉన్న బస్సులో వాళ్ళని కాపాడటానికి. బస్సులో వాళ్ళు హమ్మయ్య ఇప్పటికైనా సాయం అందిందని ఊరటగొన్నారు. అందర్నీ కాపాడారు. చివరగా ఆనందరాజు, బద్రీనాథ్ మిగిలారు అందులో. బస్సు లోయలోకి పడిపోయేలా ఉంది, బస్సులో వెనకాల ఉన్నారు ఇద్దరూ, ఆనందరాజుకి సాయం అందిస్తూ ఉన్నప్పుడు, మెళ్ళో రుద్రాక్ష దండ జారి పడిపోయింది, దానికోసం ఆనందరాజు మళ్ళీ వెనక్కి వెళ్దామని ప్రయత్నిస్తుంటే, బద్రీనాథ్ వారిస్తూ, "ప్రాణం కన్నా ఆ దండ ఎక్కువా మీకు ?, పదండి... లేదా బస్సు జారిపోతుంది లోయలోకి.. ఇద్దరం పడిపోతాం.. ". అప్పుడు ఆనందరాజు అన్నాడు, "నా ప్రాణాలు ఆ భగవంతుడి చేతి లోనే ఉన్నాయి, పడిపోతే ఆయన దగ్గరికే వెళ్తాను, ఫరవాలేదు.. ", ఆ మాటలకి బద్రీనాథ్ కి కోపం వచ్చింది, "మీ ప్రాణాలంటే మీకు లెక్కలేదు, కానీ, నాకు ఇంకా ఎంతో మందిని కాపాడవలసిన బాధ్యత ఉంది, పదండి ముందు.. ఆ దేవుడొచ్చి కాపాడతాడా ?" అని. అది ఆనందరాజు వినీ, "వచ్చాడు ఆ దేవుడు.. మీ రూపంలోనే" అన్నాడు. బద్రీనాథ్ ఆనందరాజు ముఖాన్ని చూసి, వెళ్లి ఆ రుద్రాక్ష దండ తెచ్చి ఇవ్వబోతుంటే బస్సు మరింత లోతుకి జారింది. అప్పుడు ఇద్దరి పట్టుతప్పి, జారిపోతూ చెరొక కడ్డీ పట్టుకుని వారి వారి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇంతలో, జారుతున్న ఆ బస్సు ఒక రాయికి తగిలి, పడిపోకుండా ఆగింది. ఇద్దరూ మెల్లిగా బైటపడే ప్రయత్నం చేసారు. బద్రీనాథ్ చేతిలో రుద్రాక్ష అలాగే ఉంది, ముందు తను బైటపడి, ఆనందరాజుని కాపాడాడు. ఇద్దరూ బైటికొచ్చి చూద్దురు కదా!, "ఆ రాయికి బురదతో ఉన్న ముద్రలు నామాలుగా కనపడుతున్నాయి. "

ఆనందరాజు ప్రేమగా బద్రీనాథ్ చేయి పట్టుకుని, కృతజ్ఞతతో కళ్ళకి అద్దుకుని, ఇలా అన్నాడు, "మేము మనసులో భగవంతుణ్ణి ప్రార్థించి, ఆయన కాపాడతాడని  నమ్ముతాము.. మీరు, ఆ భగవంతుని అవతారాలై మమ్మల్ని కాపాడుతున్నారు.. ఆపదలో ఆ దేవుడు కాపాడతాడని నమ్మిన మా నమ్మకాన్ని నిజం చేసేందుకే , మీ రక్షకుల రూపంలో ఆ దేవుడే వచ్చాడు" అని అన్నాడు. అప్పుడు  బద్రీనాథ్ అన్నాడు ఇలా, "దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలీదు, నా వృత్తి నా దైవం అంతే.. " అని, ఇంకొందర్ని కాపాడేందుకు పరుగు పరుగున వెళ్ళిపోయాడు. 

"ఒక ఆస్తికుడు ఆపదలో కూడా దేవుణ్ణే నమ్మాడు... ఆ దేవుణ్ణి నమ్మని నాస్తికుడు కూడా ఆ దేవుడి రూపం అయ్యాడు."

"దేవుడంటే సాయం.. ఆ సాయాన్ని తమ బాధ్యతగా అనుకుని, ఉత్తరాఖండ్ వరద బాధితుల్ని కాపాడుతున్న ప్రతి రక్షణ సిబ్బందికి, సాయానికి వెనుకాడని ప్రతి బాధ్యత గల పౌరుడికి, మనఃపూర్వక సెల్యూట్.."

 

 

 

 

 

 

 

Tuesday 25 June 2013

"నిజమైన మనిషి..."

 

 

 

నిశ్శబ్దంగా ఉంది ఆ సమయంలో మియాపూర్ బస్ స్టాపు.. పక్కనే ఒక ప్రేమ జంట, కబుర్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. స్టాపులో ఒకావిడ ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉంది. అంతలో, దూరం నుండి మెల్లగా నడవలేక నడుస్తూ, ఒక మనిషి రావడం గమనించారు వాళ్ళు. అతను నడి వయసులోనే ఉన్నాడు, కానీ, చర్మం అంతా కాలిపోయి, కమిలిపోయి వికారంగా కురూపిలా ఉన్నాడు. 

అతను వీళ్ళ దగ్గరే వచ్చి నిలబడతాడో ఏమో అని అందరూ లోలోపలే అనుకుంటున్నారు, అతను ఆ ప్రేమ జంట పక్కనుండే వెళ్తుంటే, ఆ అమ్మాయి "ఛి ఛి రాజు, ఇలాంటి వాళ్ళు తిరుగుతున్న చోటికి తీసుకొచ్చావా నన్ను, చూడు ఎంత అసహ్యంగా ఉన్నాడో, త్వరగా బస్సు వస్తే బాగుండు.. ", అటు పక్క నిల్చుందాం పద అని అతన్ని లాక్కెళ్ళింది వేరే వైపు. ఆ కురూపి ఆ మాటలు విన్నా, పట్టించుకోక వెళ్లి, బస్సు కోసం ఎదురు చూస్తూ స్టాపులో నిలబడ్డాడు. అక్కడున్న ఆవిడ కూడా, అసహ్యంతో దూరం జరిగింది అతనికి. అయినా, ఆ కురూపి ఒక చిరునవ్వు నవ్వుకుని మౌనంగా ఉండిపోయాడు. 

ఇంతలో, స్టాపులో నిలబడ్డ ఆవిడ కూతురు వచ్చింది, చేతిలో ఫైల్ పట్టుకుని, "అమ్మా ! నేను ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాను, చూడు నా జాయినింగ్ లెటర్... " అంటూ, చూపించబోతుంటే ఆ లెటర్ గాలికి ఎగిరి రోడ్డుపై పడింది. "అమ్మో ! నా జాబ్, నా లెటర్...." అంటూ, ఆమె కూతురు రోడ్డు పైకి పరిగెత్తింది. అప్పటికే అటువైపు నుండి ఒక పెద్ద లారీ వస్తోంది స్పీడుగా, ఆ అమ్మాయి అది గమనించలేదు, పైగా ఆ లెటర్ గాలికి ఎగిరిపోతూ ఉంది. అక్కడున్న ప్రేమ జంటలో అబ్బాయి, వెనకనుండి లారీ వస్తున్న విషయం గమనించి, అక్కడి నుండే ఆమెని కేకేసాడు, ఆమె విన్పించుకోలేదు,.... ఆ లారీ ఆమెకి చాలా దగ్గరగా వచ్చేసింది, అప్పుడు చూసింది ఆ అమ్మాయి.. "అమ్మా..... " అరిచింది. 

 కొన్ని క్షణాల్లో ఆమె ప్రాణం పోయేది, కానీ, ఓ చేయి ఆమెని పట్టి ఇవతలకి లాగింది, ఆ చేయి అక్కడికి వచ్చిన కురూపిది. ఆ వికారి ఆమె ప్రాణం కాపాడాడు, అందరూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఆ అమ్మాయి వచ్చి, ఆ కురూపిని హత్తుకుని, అతనికి కృతజ్ఞతగా ఒక ముద్దు పెట్టింది. అది చూసి, ఆమె తల్లి, ఆమెని లాగేసి, "ఏంటే, వాడికి ముద్దు పెడుతున్నావ్, ఎన్ని రోగాలున్నాయో యేవిటో,, ఛి ఛి.. " అంది, దానికి ఆ అమ్మాయి, "అమ్మా, ఎలా ఉన్నా, ఆయన నా ప్రాణం కాపాడాడు, అతనికి కనీసం థాంక్స్ చెప్పకుండా అలా అంటావేంటి?..  " అంటూ ఉండగా,.. అక్కిడికి ఒక మిలిటరీ వ్యాను వచ్చి ఆగింది. అందులోంచి, ఇద్దరు దిగి, ఆ కురూపి దగ్గరికి వచ్చి, సెల్యూట్ చేసి, "సారీ సార్, లేట్ అయ్యింది.. " అని ఆయన్ని వ్యానులో తీసుకెళ్ళారు. అక్కడున్న ఆ నలుగురూ, ఆ వ్యానులోంచి దిగిన ఒక అతణ్ణి అడిగారు, ఎవరతను? అని, అతనిలా చెప్పాడు, "ఆయన మిలిటరీ మ్యాన్, 6 నెలల క్రితం, ఒక చోట బాంబు పెట్టారని వెళ్లి, దాన్ని డిఫ్యూస్ చేస్తూ ఉండగా, అది పేలింది, ఎంతో మంది ప్రాణాలు కాపాడిన, ఆయన్ని మేము కష్టపడి బ్రతికించుకున్నాం, హి ఇస్ ఎ రియల్ హీరో... " అని వెళ్ళిపోయాడు. 

అంతా విని, తమ ప్రవర్తనకి సిగ్గుపడి, వాళ్ళు తల దించుకున్నారు. అప్పుడు ఆవిడ కూతురు అంది, "అమ్మా!.. కాళ్ళూ, చేతులూ, శరీరం ఏదీ బాలేకున్నా, వాళ్లకు ఏమీ కాని మన ప్రాణాలను కాపాడుతున్నారు... కానీ మనం, అన్నీ ఉండీ, కనీసం ఒక మనిషిని మనిషిగా అయినా ఆదరించటం లేదు. ఆయన కాపాడినందుకే నా ప్రాణానికి విలువ పెరిగింది, ఆయనకి నా హృదయ పూర్వకమైన నమస్కారం... "... అంతా అలాగే నిశ్శబ్దంగా ఉంది.. కానీ, ఒక చిన్న ఆలోచన మొదలైంది... 

 

దేశం కోసం,దేశంలోని ప్రజలకోసం వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే సైనిక సొదరులకి మా కధ అంకితం.

 

 

 

Saturday 22 June 2013

వెంగళప్ప ప్రేమలో పడితే ...




ఒక ఊళ్ళో ఒక వెంగళప్ప. ఊళ్ళో చదివి రెండు సంవత్సరాలు సప్లిమెంటరి లో పాస్ అయ్యాడు , ఇహ లాభం లేదని బాగా చదువుకుందామని సిటీ కి వచ్చాడు. ఒక మంచి కాలేజి చూసి అందులో ఫైనలియర్ లో చేరాడు. 

ఒక ఎనిమిది నెలల తర్వాత, అనుకోకుండా ఒక అమ్మాయిని చూసాడు. అంతే, ఆమెను చూడగానే వెంగళానికి గుండెలో గంట మోగింది. ప్రేమ అనే ఫీవర్ పట్టేసింది. ఆమె పేరు రాధ. రోజూ రాధ ని చూస్తూ ఆమెని ఫాలో అవుతూ ఉన్నాడు. వారం రోజులు చూసి చూసి, రాధ తన ఫ్రెండ్ తో అన్నది కదా .. "ఛీ ఛీ కుక్కలా ఎలా వెంటపడుతున్నాడో చూడవే " అని, అది విని బాధపడి, ఇంక దూరం నుంచి చూస్తూ ఉన్నాడు, మళ్లీ ఇలా వారం గడిచింది. అప్పుడు మళ్లీ రాధ, "ఛీ వెధవ చూడటం మానేసాడు" అంది. 

అది విని ఇంక ధైర్యం చేసి, రాధని లంచ్ కి పిలిచాడు. సరే, రోజూ ఇదే లంచ్ బాక్స్ కన్నా, ఒకరోజు వాడితో వెళ్లి లంచ్ చేస్తే పోలా! అనుకుని, సరే అంది రాధ. మన వెంగళం బాగా సంబరపడి, బాగా తయారయ్యి వచ్చాడు. రాధకి బిర్యానీ ఇంకా ఏవేవో సూపులూ, స్టార్టర్ లూ కావాలంటే, ఆర్డర్ చేసాడు. రాధని చూస్తూ, ఇంక ఆగలేక, ఐ లవ్యూ రాధా... అని చెప్పేసాడు. ఆ మాట విని రాధ, "బాబోయ్,, ఇప్పుడు నో అంటే బిల్లు కట్టకుండా వెళ్ళిపోతాడేమో?, అసలే చిల్లి గవ్వ తేలేదు ఈ వెధవని నమ్మి, తప్పదు ఇంక...", అనుకుని నవ్వి,  సిగ్గుపడి, అంతా తినేసి వెళ్ళిపోయింది. 

వెంగళానికి చెవిలో పాట మోగింది.. గాల్లో తేలినట్టుంది అని. ఆ తెల్లవారి కాలేజిలో, రాధ ని చూసి వెళ్లి హత్తుకోబోయాడు, అంతే, కాలేజి అంతా మోగేలా, చెంప పగులగొట్టి, నిన్న బిల్లు కట్టలేక నవ్వాను, నీ వెధవ మొహానికి నేనా అని తిట్టి, వెళ్ళిపోయింది రాధ. పాపం, మన వెంగాళానికి చాలా బాధ కలిగి, పది రోజులు రాలేదు కాలేజికి. ఈలోగా తనని చూసేవాళ్ళు ఎవరు లేరని, పాపం వెంగళం మంచోడు అనుకుని, అతని కోసం ఎదురు చూడగా, ఒకరోజు వచ్చాడు కాలేజికి. రాధ డైరెక్ట్ గా చెప్పలేక, "నువ్వంటే ఇష్టం.." అని రాసి, ఆ పేపరుని, వెంగళం బుక్ లో పెట్టింది. ఏ రెస్పాన్స్ లేదు. తరువాత రోజు అలాగే పెట్టింది. ఏ రెస్పాన్స్ లేదు. మూడో రోజు, నాలుగో రోజు ఇలా రోజు పెట్టింది. అయినా నో రెస్పాన్స్. ఇంక ఫైనల్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. 

వెంగళం ఇంటికి వెళ్తున్నాడని తెలిసి, అతని బుక్ లో ఇలా రాసి పెట్టింది.. "నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు, ఐ లవ్యూ... " అని. నో ఆన్సర్. పదిరోజులు గడిచాయి. వెంగళం వచ్చాడు, ఆ రోజు తనకోసం ఎదురు చూసింది రాధ, ఆమెని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. రాధ ఇంక చేసేదేమీ లేక, ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయి బాగానే ఉన్నాడనిపించి సరే అంది. నెల రోజుల్లో రాధ పెళ్ళి. 

ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి పదింటికి...  వెంగళం బుక్ ఓపెన్ చేసాడు. చూడగానే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు, ఎందుకంటే, ఇన్ని రోజులు అసలు మన వెంగళం బుక్ తెరిస్తేగా.. అన్ని ప్రేమ లేఖలు రాధ రాసిందని, ఆనందంలో, బుక్కు పక్కనెట్టి, లెటర్స్ తో ఊగిపోయాడు... మళ్ళీ మొదలైంది వెంగళానికి, "ఏమైంది ఈ వేళా... " అని. 

పరీక్ష లో ఏమి రాయలేదు, చివరి ఎగ్జామ్ రోజు, రాధని కలిసి, "రాధా.. ఐ టూ లవ్యూ..!" అన్నాడు. ఈసారి రాధ కొట్టిన చెంపదెబ్బ ఊరంతా మోగింది. "వెధవ, అన్ని రోజులు అడిగినా రెస్పాన్స్ లేదు, ఇప్పుడు పది రోజుల్లో నా పెళ్లి, కావాలంటే పెళ్ళికొచ్చి లంచ్ చేసి వెళ్ళు, నేను ఎవరి అప్పు ఉంచుకోను, " అని వెంగళానికి మంగళం పాడి వెళ్ళిపోయింది.  


అప్పుడు తెల్సుకున్నాడు వెంగళప్ప, "జీవితంలో అప్పుడప్పుడైనా పుస్తకం తెరవాలి" అని.


 

 

 

 

 

నలుగురు వెంగళప్పలు...

 

 

 

నలుగురు వెంగళప్పలున్నారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరక్క

విసిగిపోయి ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు, నలుగురూ కలిసి

ఒక పెట్రోల్ బంక్ తెరిచారు. తెరిచి నెల రోజులైనా ఒక్క బోణీ కాలేదు,

ఎందుకంటే.., వాళ్ళు దాన్ని ఫస్ట్ ఫ్లోర్ లో తెరిచారు...

సరే,ఈ సారి ఇలా కాదని,అదే చోట ఒక రెస్టారెంట్ తెరిచారు,

మళ్ళీ నెల గడిచినా ఒక్కరూ రాలేదు... ఎందుకంటే..,

పాత పెట్రోల్ బంక్ బోర్డు మార్చనేలేదు వాళ్ళు...

హు,,,విసుగొచ్చి,

ఈసారి ఒక టాక్సీ కొన్నారు,ఆ నెలరోజులూ చుట్టూ తిప్పారు.

జనం చాలానే ఉన్నా, ఒక్క మనిషి కూడా టాక్సీ ఎక్కలేదు...

ఎందుకంటే.., వాళ్ళలో ఇద్దరు ముందు, మరో ఇద్దరు వెనక

కూర్చున్నారు, ఎంతైనా వెంగళప్పలు కదా!..

ఈలోగా వాళ్ళ టాక్సీ ఆగిపోయింది, నడవట్లేదు,

నలుగురూ దిగి టాక్సీ ని తోస్తున్నారు, గంటసేపైనా టాక్సీ

ఇంచు కదల్లేదు, ఎందుకంటే..,

ఇద్దరు ముందు నుంచి, మరో ఇద్దరు వెనక నుంచి తోస్తూ ఉన్నారు...

ఛ, ఇంక ఇలా కాదు అనుకుని, ఒక 5 ఏళ్ళ బాబు ని,

కిడ్నాప్ చేసారు, "5 లక్షలు తీస్కురా" అని వాణ్ణి,

వాళ్ళ నాన్న దగ్గరికి పంపించారు,

ఆ బాబు వాళ్ళ నాన్న 5 లక్షలు ఆ బాబు చేతికిచ్చి, వాళ్ళకి    

తిరిగి పంపించాడు, ఎందుకంటే.... వాడూ ఈ నలుగురి లాగే,

ఒక వెర్రి వెంగళప్ప కాబట్టి....!

Monday 17 June 2013

సహానా.. !


 గ్రీసు దేశం లో సహానా అనే ఒక పన్నెండేళ్ళ పాప ఉండేది. సహానా ఓ అనాధ. తన ఆకలి తీర్చుకోవటానికి ఒక జమీందార్ దగ్గర పని చేసేది. ఆ జమీందార్ ఎంత పని చేస్తే అంతే ఇచ్చేవాడు. ఎప్పుడైనా జ్వరం వచ్చి సహానా కి బాలేకపోతే, అప్పుడైనా దయ చూపే వాడు కాదు.
 

ఇలా ఉండగా, ఒక రోజు సహానా కి జ్వరం వచ్చింది, మరెలా ?, పని చేస్తేనే కానీ ఆ రోజు ఆమెకి తిండి ఉండదు. అయినా ఇంకేమీ చేయలేక పనికి బయల్దేరింది. దారిలో ఒక చోట, ఒక పెద్దాయన ఊళ్ళో అందరికి యాపిల్ పళ్ళు పంచుతున్నాడు. హమ్మయ్య! ఈ పూటకి ఒక పండు తినేసి ఇవాళ కొంత విశ్రాంతి తీస్కుని, రేపు మళ్ళీ పనికి వెళ్దాం అనుకుని, ఆ లైనులో నిలబడింది. పాపం, జ్వరం ఉండటం వల్ల చాలా నీరసంగా ఉంది సహానా కి. అయినా ఇంక తప్పదు అని అలాగే లైనులో నిల్చుంది. ఎంతో సేపు ఎదురు చూడగా, తనకి పండు తీసుకునే అవకాశం వచ్చింది. సహానా చేతిలో ఆ పండు పెడుతుంటే, అది జారి పడిపోయింది. కింద పడగానే, ఒక కోతి వచ్చి ఆ పండుని కాస్తా ఎగరేసుకు పోయింది. సహానా, ఆ పెద్దాయన్ని ఇంకో పండు ఇవ్వమని అడిగింది. దానికాయన, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాను, అది పడిపోయింది అన్నాడు. అది నా తప్పు కాదు కదా అన్నది సహానా. సరే, నీ తప్పు లేదు కనుక నీకు పండు ఇస్తాను, కానీ, అందరూ నీలాగే ఆకలితో ఎదురుచూస్తున్నారు, కాబట్టి, నువ్వు వెళ్ళి మళ్ళీ లైనులో నిలబడు, నీ అవకాశం వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడు. ఇంక వేరే దారి లేక, సహనా పాపం మళ్ళీ వెళ్ళి అందరికన్నా చివర్లో నిల్చుంది. 

బాగా ఆకలిగా ఉంది సహానాకి, ఓపిక అసలే లేదు, ఒక వైపు కళ్ళు తిరుగుతున్నాయి, అయినా, ఆ పండు తింటేనే తన ఆకలి తీరుతుంది అని తెలుసు, అందుకే ఎంత కష్టంగా ఉన్నా అలాగే ఎదురు చూస్తూ ఉంది. కొన్ని గంటల తర్వాత తన అవకాశం వచ్చింది. ఈసారి, ఆ పెద్దాయన పండుని జాగ్రత్తగా ఆమె చేతిలో పెట్టి ఇలా  అన్నాడు, "ఈ పండు అప్పుడే ఇస్తే సరిపోయేది కదా అని నీకు అనిపిస్తుంది కదా ?" అని, దానికి సహానా, అవును అంది. ఆయన ఆమె పేరు అడిగి తెల్సుకుని ఇలా అన్నాడు, "సహానా!, ఇక్కడ ఇంత మంది ఉన్నారు, అందరు పండు కోసం ఆశ పడి వచినవాళ్ళు, కానీ, నువ్వు ఆ పండు వల్ల నీ ఆకలి తీరుతుందని వచ్చావు, నీ పరిస్థితి బాలేదని నాకు తెల్సు, అందుకే నేను మొదటి సారి పండు ఇచ్చినప్పుడు కావాలనే, ఆ పండు కింద పడేలా ఇచ్చాను, ఎందుకంటే ఆ పండు బాలేదు, పాడైపోయింది. ఇప్పుడు నీకు ఇస్తున్న ఈ పండు, అన్నిటికన్నా స్వచ్చమైనది, మహిమ గలది. ఇక్కడ అర్హత ఉన్నవాళ్ళకి దీన్ని ఇవ్వాలని ఈ ఊరికి వచ్చాను, నువ్వు ఒకసారి కోల్పోయినా ఇంకా దానికోసం ఎంత కష్టమైనా ఎదురు చూసావు, చిన్నదానివైనా నీ ఓపిక తో దీన్ని నువ్వు సొంతం చేసుకున్నావు, ఈ పండు తిని ఐదు వరాలు కోరుకో, అవన్ని తీరుతాయి" అని చెప్పి ఆశీర్వదించి  వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన. సహానా సంతోషించి, పండు తిని, ఐదు వరాలు కోరుకుని, ఇంక తన జీవితాన్ని ఆనందమయం చేసుకుంది. 

Saturday 15 June 2013

పళ్ళ తోటలో నాలుగు పక్షులు...






అదొక అందమైన పళ్ళ తోట, అందులో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టులో నాలుగు గూళ్ళు ఉన్నాయి. ఆ నాలుగు గూళ్ళలో సీత, గీత, మీన, మైనా అనే నాలుగు పక్షులు ఎంతో స్నేహంగా ఉండేవి. కలిసి ఆటలాడుకునేవి, పాటలు పాడుకునేవి, ఎప్పుడూ సరదాగా ఉండేవి. అయితే ఆ నలుగురిలో సీత మాత్రం ఎంతో తెలివైనది.


ఒకరోజు సాయంత్రం, చల్లగా గాలి పళ్ళ వనం మీదుగా వీస్తూ పచ్చని ఆకులపై జాలువారుతూ తాన్సేన్ సంగీతం లా హయిని ఇస్తు ఉండగా, హాయిగా ఆ నాలుగు పక్షులూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందిస్తు ఉన్నాయి, అయితే సీతకి మాత్రం, ఆ గాలి ఎక్కువ అయ్యేలా ఉంది, పెద్ద వర్షం వస్తుందేమో అని అనిపించింది. అదే మాట వాళ్ళతో చెప్పి, వర్షం ఎక్కువ అయితే మనకి తినటానికి ఏమీ ఉండదు, అందుకే వర్షం పెద్దగా లేనప్పుడే మనం కొన్ని పళ్ళు ఫలాలు తెచ్చుకుందాం అని అంది. మైనా ఏమో, సరే మరి సీత చెప్పేది నిజమే అవ్వొచ్చు కదా అని సరే వెళ్దాం అంది. దానికి మీనా అన్నది కదా ! సీత కి ఎప్పుడూ పనే కావాలి, సరదాగా ఎంజాయ్ చేయటమే రాదు, దాని మాటలు విని వెళ్ళి ఇంత మంచి సరదా సమయాన్ని ని దూరం చేసుకోవాలా, నేను గీత ఉంటాము, మీరు ఇద్దరు వెళ్లండి కావాలంటే అని. గీత ని అడిగితే ఎప్పుడూ నేను మీనా తోనే ఉంటాను కదా, మీరు వెళ్ళండి అంది. సరే అని సీత, మైనా రెండూ, ఎగురుకుంటూ వెళ్ళి, పళ్ళు కోసుకుని వస్తూ ఉన్నాయి. వాళ్ళని చూసి మీన, గీత నవ్వుకున్నాయి, ఏంటో వీళ్ళ పిచ్చి గాని, వర్షం లేదు ఏమీ లేదు, అనవసరంగా మంచి సరదా ని కోల్పోతున్నారు అని అనుకున్నాయి.


సీత, మైనా పళ్ళు తెచ్చుకుని గూట్లో దాచుకున్నాయో లేదో, వెంటనే గాలి జోరుగా వీచి, వర్షం పెద్దగా అయ్యింది. వర్షం తగ్గుతుందేమో అని అనుకున్నాయి, మీనా, గీతలు. ఆ వర్షం పెద్దగా మారి మూడు నాలుగు గంటలు కాదు కదా ఎనిమిది గంటలైనా తగ్గలేదు. ఈలోపు, మీనా కి, గీతకి చాలా ఆకలేస్తూ ఉంది. సీత, మైనాలు తెచ్చుకున్న పళ్ళను తిని హాయిగా ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. మీనా గీతలు మాత్రం చాలా నీరసించి పోయి, ఆకలికి తట్టుకోలేక చచ్చిపోయేలా అయిపోయాయి. ఇంక సీత వాళ్ళని చూసి, అన్నది కదా, "మీరు కొన్ని నిమిషాల ఆనందం కోసమని ఆలోచించారు, అదే మీరు అప్పుడు మాతో వచ్చి ఉంటే ఇప్పుడు హాయిగా ఇన్ని గంటలు ఆనందించే వాళ్ళు కదా, ఎంత సుఖం ఉన్నా మన సమయాన్ని స్థానాన్ని మరచిపోవద్దు", అయినా మీరు బాధ పడొద్దు, మేము మీకు కూడ ఆహారం తెచ్చాం, ఇదిగో తినండి అని పళ్ళని ఇచ్చింది సీత. ఎప్పుడూ పని వృధాగా పోదు, సమయం ఎంతో విలువైనది అని తెలుసుకున్నాయి మీనా, గీతలు. ఆకలి తీర్చుకుని ఇంక ఆ నాలుగూ హాయిగా స్నేహం కాలం గడిపాయి

ప్రేమ... ప్రేమ...






మాధవ్, ప్రేమ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. తరచూ ఇద్దరు కలుసుకునే వాళ్ళు, కానీ, మాధవ్ ఎప్పుడు ఒక గంటైనా లేట్ గా వచ్చేవాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సరంలో ఎన్ని సార్లు కలిసినా అంతే. రోజూ అలా లేట్ గా వచ్చినా ప్రేమ అసలు ఏ రోజూ ఏమీ అనలేదు మాధవ్ ని. ప్రేమ పుట్టినరోజు కూడా ఒకసారి మర్చిపోయాడు, చివరికి గుర్తొచ్చాక, ప్రేమతో ప్రేమని హత్తుకుని, ఐ లవ్ యూ చెప్పి, విష్ చేసాడు. తన ప్రేమకి పులకించిపోయింది ప్రేమ.

ఇలా ఉండగా, ఒకరోజు మాధవ్ ఎంత ఎదురు చూసినా ప్రేమ రాలేదు, ఎందుకో అని ఆమె ఇంటికి వెళితే తను హాస్పిటల్ కి వెళ్ళిందని తెల్సింది, ఎందుకు వెళ్ళిందా అని ఆరా తీస్తే ప్రేమ ఇంకో పది పదిహేను రోజులకి మించి బ్రతకదు అని తెలుసుకున్నాడు, ఏమీ బాధ పడకుండా చిరునవ్వుతో ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఆమె చేతిలో ఒక లెటర్ పెట్టి, "ఇంకో ఎనిమిది రోజుల్లో నా పుట్టిన రోజు ఉంది కదా, ఆ రోజు, ఈ లెటర్ చదువు... నేను ఇంటర్వ్యూ కి బెంగుళూరు కి వెళ్తున్నాను, పది రోజుల తర్వాత తిరిగొచ్చి కలుస్తాను", అని చెప్పి వెళ్ళిపోయాడు.

మాధవ్ పుట్టినరోజు నాడు ప్రేమ ఆ లెటర్ తెరిచి చదవగా...

ఆ ఉత్తరంలో ఇలా ఉంది.. "ప్రేమ, నా ప్రియా! ఇన్ని రోజుల్లో ఎప్పుడు లేట్ గా వచ్చినా నువ్వేమీ అనలేదు, నీ పుట్టినరోజుని మరచినా, ప్రేమ కురిపించావు. నేను నీకు ఏం ఇవ్వగలను?,అందుకే, నువు చేరుకోబోయే లోకంలో నీ రాకకై వేచి ఉన్నాను. మనం చనిపోయినా, మన ప్రేమ ఎప్పటికీ చావదు, ఐ లవ్ యూ రా..!"

Monday 10 June 2013

కష్టే ఫలి...

కష్టే ఫలి...


అనగనగ...

ఒక ఊరిలో రాము,సోము అనే ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఉన్నారు.వాళ్ళల్లో రాము కుంటివాడు,సోము గ్రుడ్డివాడు, వాళ్ళిద్దరికి మంచి స్నేహం కుదిరింది. ఒక రోజున రాము సోము ఇద్దరూ పక్క ఊరి జాతరకు వెళ్ళి ఎలాగైనా ధర్మం రూపంలో డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు.

ఐతే వాళ్ళల్లో ఒకరు చూడలేరు, ఒకరు నడవలేరు. జాతరకు ఇంకా పది రోజులు మాత్రమే ఉంది. ఎలా వెళ్ళాలా అని ఆలోచించగా వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళిద్దరూ వెళ్ళటానికి ఏదైనా ఒక బండి తయారు చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. వెనువెంటనే దానిని అమలు పరిచారు. ఒకసారి దానిమీద అలా పక్క సందు దాక వెళ్ళి వద్దాం అని అనుకునే లొపే వర్షం వచ్చింది,అప్పుడు వాళ్ళు  ఎండకి ఎండకుండా,వానకి తడవకుండా ఉండే బండి తయారు చేయాలని నిర్ణయించుకొని, దానిని తయారు చేసారు.

ఆ బండి మీద ఒకసారి పక్క సందు దాక వెళ్ళి వద్దాం అని అనుకొని బయలు దేరారు, అలా వెళ్తుండగా, ఒక వాహనాలమ్మే వ్యాపారి చూసి, దీనిని మీరెక్కడ కొన్నారు అని అడిగాడు. ఈ బండి మేమే తయారు చేసాం అని రాము,సోము చెప్పారు.

అప్పుడు ఆ వ్యాపారి, ఎంత ఖర్చైనా సరే ఇలాంటి బళ్ళు ఒక పది కావాలి, మీరు తయారు చేసి ఇవ్వగలరా? చెప్పండి, అని అడిగాడు. అప్పుడు రాము,సోము ఇద్దరూ, అడుక్కుంటే వచ్చే డబ్బు కంటే, ఈ విధంగా మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో సంతోషంగా బ్రతకొచ్చు కదా! అనుకుని, ఇంక, వాళ్ళిద్దరు అడుక్కునే వృత్తి  మానేసి, కొత్త కొత్త వాహనాలు తయారుచేస్తూ, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

 

మనసుతో మనువు...

మనసుతో మనువు...



అబ్బాయి: హేయ్! నీ పేరేంటి?
అమ్మాయి: ఎవర్నువ్వు? నువ్వెవరో తెలికుండానే పేరు చెప్పాలా?
అబ్బాయి: సరే, నా పేరు శశి.
అమ్మాయి: హా ఐతే ఏంటి?
అబ్బాయి: ఇప్పుడు నేనెవరో తెల్సింది కదా, ఇప్పుడైనా నీ పేరు చెప్పు. ప్లీజ్...
అమ్మాయి: ఓహో! ఐనా ఎందుకు చెప్పాలి?
అబ్బాయి: నువ్ నాకు నచ్చావ్ కాబట్టి. రేపు మన పెళ్ళి అవ్వొచ్చు, నిన్ను పేరు పెట్టి పిలవకుండా ఎలా పిలవాలి? ఐనా ఫరవాలేదు, కానీ, అందరి ముందూ నిన్ను బంగారూ అని పిలవలేను కదా బంగారం..!
అమ్మాయి: ఆగు ఆగు ఒక్క నిమిషం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా?
అబ్బాయి: అవును నిజం మాట్లాడుతున్నాను.
అమ్మాయి: ఏంటి నిజం? ఇలా రోడ్డుపై ఎవరినిపడితే వాళ్ళని పట్టుకుని పెళ్ళి గిళ్ళి అని అనేవాళ్ళని పిచ్చోళ్ళనే అంటారు.
అబ్బాయి: నిజమే కదా. నాకు నువ్వంటే పిచ్చి. నీ పేరు చెప్పు బంగారం వినాలని ఉంది.
అమ్మాయి: అబ్బా! అసలే నా బాధలో నేనుంటే నీ గోల ఏంటి? ప్లీజ్, విసిగించకు, వెళ్ళిపో.
అబ్బాయి: నీ బాధ పొగొట్టేందుకే నేను వచ్చాననుకో. ఏమైందో చెప్పు..
అమ్మాయి: సరె విను, సాయంత్రం మా ఇంట్లో నాకు పెళ్ళిచూపులు. చాలా!.. ఇప్పటికైనా వదిలెయ్ ప్లీజ్..
అబ్బాయి: పెళ్ళి చూపులా? ఐతే, నిన్ను ఒప్పించుకోటానికి నాకు ఇంకా ఈ ఒక్క పూటే ఉందా?
అమ్మాయి: అయ్యో! దేవుడా... నాకేంటి ఈ బాధ. (అంటూ చిరాగ్గా వెళ్ళిపొతోంది)
అబ్బాయి: (వెళ్తున్న ఆమె ముందుకొచ్చి అంటున్నాడు) సరే ఇంక బాధ పెట్టను, కానీ, ఒక్క మాట... నీ తల్లిదండ్రులు తీస్కొచ్చిన వాడు, నీ వయసుని అందాన్ని ఆస్తిని మాత్రమే ప్రేమించగలడు. అది కొంత కాలం మాత్రమే మిగిలి ఉంటుంది. నీ మనసుని వలచిన నాతో జీవితకాలం అంతా సుఖంగా ఉంటావు. మనసుని గెలిచిన వాడితో నూరేళ్ళు సుఖంగా ఉంటావో, లేక, నీ అందం వలచిన వారితో కొంతకాలమే సుఖంగా ఉంటావో నీ ఇష్టం.. నాతో ఉంటే ప్రతి క్షణం నువు మరువలేని ఙ్ఞాపకాలు బహుమతిగా ఇస్తాను.
(ఆ మాటలు ఆ అమ్మాయిని తాకాయి, కానీ, ఆమె బదులు వినకుండానే అతను వెళ్ళిపోయాడు)
ఎవరతను అసలు.. అని అతని గురించే అలోచిస్తూ ఇంటికెళ్ళింది ఆ అమ్మాయి,,, పెళ్ళి చూపులకి వచ్చిన వాళ్ళకి టీ ఇద్దామని తల ఎత్తింది,, అంతే, ఎదురుగా ఉన్న అబ్బాయి అతనే.. తను ఏమి మాట్లాడలేక లోపలికెళ్ళిపొయింది... అప్పుడతను వచ్చి ఆమెతొ అన్నాడు.. పెళ్ళంటే ఏ అమ్మాయికైనా చాలా భయాలూ ప్రశ్నలూ ఉంటాయి, నువ్వు నన్ను అలాంటి భయంతో చేస్కొవటం కన్నా ప్రేమతో చేస్కోవాలి అనే అలా మధ్యాహ్నం వచ్చి సరదాగా పరిచయం చేస్కున్నాను, సారీ!... అంతా విని,
ఆ అమ్మాయి సిగ్గుపడి నవ్వుతూ అతని కళ్ళని చూస్తూ అవునని చెప్పకనే చెప్పింది.
అబ్బాయి: ఇప్పటికైనా నీ పేరు చెప్తావా మరి?...
అమ్మాయి: బంగారం నా పేరు... పిలుచుకో అలాగే !
అబ్బాయి: ?!...... హ హ్హ హ్హ ...

సైనికుడు..

సైనికుడు.. 

 

 

ఒక సైనికుడు యుద్ధం అనంతరం ఇంటికి వస్తు, తల్లిదండ్రులకి ఫోన్ చేసాడు. సైనికుడు ఇలా అన్నడు "నాన్న, యుద్ధం అయిపోయింది, ఇంటికి వచ్చేస్తున్నను, అయితే ఒక చిన్న కోరిక"

"ఏమిటది బాబూ" అన్నాడు తండ్రి.

"మీకు అభ్యంతరం లేకపొతే నా స్నేహితుడిని కుడ తీసుకురావొచా.. తనకి ఎవరూ లేరు" అన్నాడు సైనికుడు.

"తప్పకుండా".

"కాని యుద్ధంలో తన కాళ్ళు చేతులు తెగిపోయాయి. మనమే జీవితాంతం చుసుకోవాలి. నాకు చాలా ఆత్మీయుడు నాన్న"

కొంత సమయం నిశ్శబ్దం తరువాత తండ్రి "బాబు! మన మీద చాలా పని పడుతుంది ఒక అంగవైకుల్యుడికి జీవితాంతం సేవ చేయడం ఏంత కష్టమో నీకు తెలీదు" అన్నాడు.

వెంటనే తల్లి ఫొన్ తీసుకొని "అతడి దారి అతడు చూసుకుంటాడులేరా. అందరికీ సేవ చేసుకుంటూపోతే మనకి శ్రమే మిగులుతుంది" అంది.

సైనికుడు కొంతసేపు మాట్లడి ఫొన్ పెట్టేసాడు.

ఆ తరువత ఆ సైనికుడి సవాన్ని అతడి ఇంటికి సైనికాధికారులు తన తల్లిదండ్రులకి పంపారు. ఆ సైనికుడు యుద్ధంలొ మరణించలేదు ఆత్మహత్య చేసుకున్నడు..

ఆ యుద్ధం లొ కాళ్ళు, చేతులు కోల్పోయింది తన మిత్రుడు కాదు ఈ సైనికుడే....

కాకి నక్క ..

కాకి నక్క .. 

 

 
 
ఒక పెద్ద అడవిలో ఓ చింత చెట్టు ఉందంట. ఆ చెట్టుపై పొడవాటి ముక్కుతో ఒక నల్లటి కాకి ఉందంట. అయితే ఆ చెట్టు కింద, ఆ కాకికి ఒక మాంసపు ముక్క దొరికిందంట. ఆ కాకి మాంసపు ముక్కని తన పొడవాటి ముక్కుతో కరుచుకుని ఎగురుకుంటూ వెళ్ళి ఇంకో చెట్టుపై వాలింది హాయిగా తిందామని. అదే సమయానికి అక్కడే ఆడుతూ పాడుతూ ఉన్న నక్క , ఆ మాంసపు ముక్క వాసనని గమనించి, ఇంత రుచికరమైన వాసన ఎక్కడినుంచి వస్తుందబ్బా అని వెతుకుతూ ఉందంట. అప్పుడు చెట్టుపై ఉన్న కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్కని చూసిందంట. అంతే, ఇంక ఆ మాంసపుముక్కని ఎలా కొట్టెయ్యాలి అని ఆలోచించి, ఒక పథకం వేసుకుందంట.

పథకం ప్రకారం, నక్క ఆ కాకి దగ్గరికెళ్ళి అన్నది కదా! "ఓ నల్ల కాకీ! నువ్వు నల్లగా నిగ నిగ మెరుస్తూ భలే అందంగా ఉన్నావు తెలుసా ? నువ్వే ఇంత అందంగా ఉంటే, నీ గొంతు ఇంకెంత తియ్యగా ఉంటుందో కదా ! మరి నాకోసం ఒక్క పాట పాడవా ?" అనడిగిందంట. దానికా కాకి ఎంతో పొంగిపోయి, ఆహా నా అభిమాని ఈ నక్క అనుకుని పాట పాడదామని నోరు తెరిచిందంట. కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్క జారి నక్క నోట్లో పడిందంట.

ఇంక ఆ నక్క ముక్కని తీసుకుని తుర్రుమన్నదంట...