Tuesday 28 January 2014

నమ్మకం



రాజారావు అనే ఒక వ్యాపారి దిగాలుగా సర్వం కోల్పోయి శూన్యాన్ని చూస్తూ కూర్చున్నాడు. సమయం గడుస్తూ ఉంది. అంతా శూన్యం, అంతా మౌనం. నాకు దిక్కెవరు? అని మనసు ఆవేదన పడుతూ ఉండగా, ఒక వయో వృద్ధుడు అతని పక్కన కూర్చుని, అతని పరిస్థితిని గమనించి ఏమైందో చెప్పమన్నాడు. అంతే, కట్టలు తెంచుకున్న దుఃఖంతో, "అంతా అయిపోయింది. ఎంతో ఘనంగా బ్రతికిన జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వ్యాపారంలో తీరని నష్టం, అప్పుల వాళ్ళ వెంబడింపులు, అయినవాళ్ళ ఈసడింపులు.. నిన్న గొప్పగా చూసిన ఆ మనుషులే నేడు పురుగులా తీసేస్తున్నారు. ఇంక దిక్కెవరు?" అంటూ భోరుమన్నాడు రాజారావు.

ఆ వృద్ధుడు ఎంతో ప్రేమగా అతని భుజం తట్టి, "నీ ఇబ్బందులు నాకు అర్థమయ్యాయి. ఆ దేవునిపై భారం వేసి నీకు ఈ ఆర్థిక సహయం చేస్తున్నాను, మళ్ళీ మొదలుపెట్టు, కానీ, వచ్చే యేడు ఇదే సమయానికి నాకు ఇదంతా తిరిగి ముట్టజెప్పాలి సుమా.." అని చెప్పి ఒక చెక్కు తీసి సంతకం చేసిచ్చాడు. ఆ చెక్కు ఐదు లక్షల డాలర్లు విలువైంది. ఆ సంతకం రాక్ ఫెల్లర్ ది. అంతా కోల్పోయాననుకుని కృంగిపోతున్న రాజారావులో విశ్వాసం ఉప్పొంగింది. ఏదైనా ఇక ఈ ఆలంబన నాకు ఉందనే ధైర్యం కొండంత ధైర్యాన్నిచ్చింది. చెక్కుని బీరువాలో భద్రంగా దాచుకున్నాడు. వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించాడు. అతని గుండె నిబ్బరాన్ని చూసిన అప్పులవాళ్ళు కూడా అతణ్ణి ఒత్తిడి చేయలేకపోయారు. ఏదైనా జరిగితే, ఈ చెక్కు ఉంది కదా కాపాడుతుంది అని భద్రం చేసుకుని, ఆ చెక్కుని విడిపించే అవసరం లేకుండానే, తన స్వయం కృషితో వ్యాపారంలో అంతులేని లాభాల బాటను పరిచాడు. జీవితం ఆనందమయమైంది. ఆ పరిస్థితులు ఎవరేమిటో తెలుసుకునేలా చేసాయి. ఒక్క ఓటమి ఎన్నో పాఠాలు నేర్పింది. యేడాది గడిచింది. ఇక ఆ చెక్కుని తీసుకుని, వడ్డీ ని కలుపుకుని తిరిగి ఇద్దామని ఆ చోటికి వెళ్ళి ఎదురుచూస్తున్నాడు రాజారావు.

ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ వృద్ధుణ్ణి, ఒక నర్సు పట్టుకుంది. ఏమిటండీ ఆయన్ని అలా బలవంతం చేస్తున్నారు అనడిగాడు రాజారావు. "ఇతనికి తనకు తాను రాక్ ఫెల్లర్ ని అని చెప్పుకొవటం అలవాటు, ఈ పార్కులో ఉన్నోళ్ళందరికీ చెక్కులిచ్చి ఫూల్స్ చేస్తూ ఉంటాడు, పెద్ద మెంటల్ పేషెంట్. ఇదో రకమైన పిచ్చి" అని చెప్పి అతణ్ణి లాక్కుని అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
దానికి ఆశ్చర్యపోయి, "పిచ్చివాడైతేనేం? నాలో మనో బలాన్ని పెంచిన మహనీయుడు, ఆయన బాధ్యత స్వీకరించి ఆయన రుణం తీర్చుకుంటాను" అనుకుని నమ్మకంతో అక్కణ్ణించి కదిలాడు రాజారావు. ఇకపై అంతా సఫలమే...

ఫ్రెండ్స్.., "మనిషికి గెలుపు ఓటమి సహజం. ఆపదలోనో బాధల్లోనో కూరుకుపోయిన వారికి కాస్తంత ప్రోత్సాహాన్ని నమ్మకాన్ని ఇచ్చినవారు నిజంగా దైవంతో సమానులే. గెలిచినపుడు చప్పట్లు కొట్టి ప్రోత్సహించటం ఎంత అవసరమో, ఓడినప్పుడు భుజం తట్టి ధైర్యాన్నివ్వటం అంతే అవసరం. అలాగే, సహాయం చేసినవారిని మరువకూడదు. చివరికి మనిషికి మనిషే కదా తోడు, మానవత్వమే కదా ఆలంబన. "

Friday 17 January 2014

పిల్లి

అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లి అన్నీ తుంటరి పనులు చేస్తూ దొంగ వేషాలేస్తూ అందరి చేతా దొంగ పిల్లి అని తిట్టించుకుంటూ ఉండేది. ఈ దొంగ పిల్లి వంకర బుద్ధిని కనిపెట్టి ఎవరూ రెండ్రోజుల కంటే ఎక్కువ దాని గురించి పట్టించుకునేవారు కాదు. దాంతో ఆ దొంగ పిల్లికి తిండి కూడా సరిగ్గా దొరక్క చాలా ఇబ్బంది అయిపోయేది. అయినా సరే, తన పద్ధతి ఏ మాత్రం మార్చుకోకుండా అలాగే చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ, అందర్నీ విసిగిస్తూ, తిండిని దొంగతనం చేస్తూ, ఆ ఇల్లూ ఈ ఇల్లూ తిరుగుతూ బతికేస్తూ ఉండేది ఆ దొంగ పిల్లి.

ఒకసారి ఇలాగే ఒకరింట్లో తిట్లూ తన్నులూ తిన్నాక మళ్ళీ పొట్ట నింపుకోవడం కోసం మరో ఇల్లు వెతుక్కుంటూ ఒక కొత్త గడప దగ్గరికి వెళ్ళింది దొంగ పిల్లి.


ఆ ఇల్లు బుజ్జిగాడు వాళ్ళు ఉండే ఇల్లన్నమాట. బుజ్జిగాడికి ఓ ఏడాది వయసుంటుంది. గడపలో నుంచి లోపలికి తొంగి చూసిన దొంగ పిల్లికి లోపల ఇల్లంతా పాకేస్తూ బుడి బుడి అడుగులేస్తూ ఉన్న బుజ్జిగాడు కనిపించాడు. అక్కడ నుంచి దొంగ పిల్లి వంటింటి వైపు వెళ్ళింది. మరి తినడానికి ఏదన్నా దొరికేది అక్కడే కదా! అక్కడ వంట చేస్తున్న బుజ్జిగాడు వాళ్ళమ్మ పిల్లిని చూసీ చూడగానే చిరాకు పడిపోయి కర్రొకటి పుచ్చుకుని గట్టిగా అదిలించింది దూరంగా పొమ్మని.


దొంగ పిల్లికి అర్థమైపోయింది ఇంక ఈ ఇంట్లో తనకి తిండి దొరకడం కష్టమేనని. ఉసూరుమంటూ మళ్ళీ వీధి గుమ్మం వైపు వచ్చేసరికి లోపల నేల మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్న బుజ్జిగాడు కనిపించాడు. అంతలోనే బుజ్జిగాడు వాళ్ళమ్మ ఒక పళ్ళెంలో బిస్కెట్లు తీసుకొచ్చి బుజ్జిగాడి పక్కన పెట్టి తింటూ ఆడుకోమని చెప్పి వాడికో ముద్దిచ్చి మళ్ళీ వంటింట్లో పని చేసుకోడానికి వెళ్ళిపోయింది. ఇంతలోనే బోల్డన్ని దొంగ బుద్ధులున్న మన దొంగ పిల్లికి ఒక దొంగ ఆలోచన వచ్చింది. అస్సలు చప్పుడు చెయ్యకుండా మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళి వాడి పక్కన పళ్ళెంలో ఉన్న బిస్కెట్లన్నీ నోట కరచుకుని గబా గబా ఇంట్లోంచి బయటికి పారిపోయింది.


ఇలాగే రోజూ వచ్చి బుజ్జిగాడి కోసం వాళ్ళమ్మ పెట్టిన బిస్కట్లన్నీ లాగేసుకుని తినేస్తూ ఉండేది దొంగ పిల్లి. అయినా సరే బుజ్జిగాడు అరవడం గానీ, ఏడవడం కానీ చేసేవాడు కాదు. ఆ పిల్లిని చూసినప్పుడల్లా నవ్వుతూ కేరింతలు కొట్టేవాడు.

ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకసారి బుజ్జిగాడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఇంటికి తాళం పెట్టి రెండ్రోజుల పాటు ఊరెళ్ళారు.
ఆ రెండ్రోజులూ దొంగ పిల్లికి ఎంత ప్రయత్నించినా ఎక్కడా తిండి దొరకలేదు. దాంతో చాలా నీరసపడిపోయిన దొంగ పిల్లి అన్ని చోట్లా తిరిగి తిరిగీ మళ్ళీ చివరికి బుజ్జిగాడి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. దాంతో బుజ్జిగాడి దగ్గర తిండి దొరుకుతుందన్న ఆశతో ప్రాణం లేచి వచ్చినట్టయింది దొంగ పిల్లికి. అయితే అప్పుడే బుజ్జిగాడు వాళ్ళమ్మ బిస్కెట్లు తీస్కొచ్చి బుజ్జిగాడికిచ్చి అక్కడే పక్కనే కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. ఆవిడకి పిల్లులంటే అస్సలు ఇష్టం ఉండదు, చూస్తే కోప్పడుతుందని తెల్సిన దొంగ పిల్లి ఆవిడ ముందు బయట పడలేక, మరో పక్కేమో ఆకలికి తాళలేక గుమ్మం దగ్గర నక్కి అప్పుడప్పుడూ లోపలికి తొంగి చూస్తోంది.
కాసేపటికి ఇలా దాగుడు మూతలు ఆడుతున్న దొంగపిల్లి బుజ్జిగాడి కంట్లో పడింది. వాడు లేచి మెల్లగా బుడి బుడి అడుగులేసుకుంటూ గుమ్మం దగ్గరికొచ్చి తన చేతిలో ఉన్న బిస్కెట్ ని పిల్లి ముందు పడేసాడు. వెంటనే పిల్లి బిస్కెట్ అందుకుని తినేసింది. అప్పుడు బుజ్జిగాడు కూడా అక్కడే కూర్చుండిపోయి కిలకిలా నవ్వుతూ పిల్లి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. అన్ని రోజుల నుంచీ తన బిస్కెట్లు అన్నీ ఎత్తుకుపోయినా సరే అందరిలాగా చీదరించుకోకపోగా అంత ప్రేమగా తన కోసం ఇప్పుడు బిస్కెట్ తెచ్చిచ్చిన బుజ్జిగాడిని చూసి పిల్లికి పశ్చాత్తాపం కలిగింది. ఇంతలో బుజ్జిగాడు వాళ్ళమ్మ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి పిల్లికి భయమేసి పారిపోబోయింది. కానీ, ఎప్పటి లాగా ఆవిడ విసుక్కోలేదు. ఇద్దర్నీ చూసి నవ్వేసి ఇంకో నాలుగు బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది.

వాళ్ళ ఆదరణ చూసి దొంగ పిల్లికి బుద్ధొచ్చింది.


ఎంతసేపూ నేను, నా తిండి, నా కోసం అని స్వార్ధంగా ఆలోచించుకుంటూ ఇలా అందరి చేతా తిట్లు తింటూ బతకడం ఎంత మూర్ఖత్వమో తెలిసొచ్చింది. ఏదైనా మన చుట్టూ ఉన్నవారితో స్నేహంగా ఉండటంలోనూ, మరొకరితో పంచుకోవడంలోనే ఎంతో సంతోషం, సంతృప్తి ఉన్నాయని అర్థమయ్యాక దొంగ పిల్లి కాస్తా మంచి పిల్లిలా మారిపోయింది. బుజ్జిగాడికి మంచి నేస్తం అయిపోయింది.. ఎంచక్కా వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండిపోయారు.


మాన్డవిల్లి దుర్గ గారి  సహకారంతో