Friday 25 April 2014

అమ్మవారు...

"అబ్బబ్బబ్బబ్బ.. ఈ పనితో ఛస్తున్నాను, ఈ గుడి మొత్తం ఊడ్చి ఊడ్చి నడుం పడిపోయేలా ఉంది. అమ్మా ! అమ్మోరు తల్లీ.! నీకే ? హాయిగా బొమ్మలా కూర్చుని ఉంటావు, నా పనే ఇలా గగనమైపోయింది.." అని తిట్టుకుంటూ, వంగుతూ, లేస్తూ గుడి శుభ్రం చేస్తూ ఉంది తాయారు. పనిలో చేరి నెల రోజులైనా, ఈ తిట్లు మానదు. రోజూ ఇలాగే కసురుకుంటూ పని పూర్తి చేసుకునేది.

ఇదంతా చూసి చూసి, ఒకరోజు అమ్మవారే పలికింది, "తాయారు.. అసలు ఏమిటి నీ బాధ?" అని. తాయారుకి ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అమ్మవారు స్వయంగా చెప్పింది , "నేనే.. " అని. ఓహో.. అమ్మోరు తల్లేనా మాట్లాడేది, "నీకు తెల్సు కదమ్మా, ఒకప్పుడు ఎంత బాగా బ్రతికినదాన్నో.. ఇప్పుడిలా ఊడ్చి తుడిచి బ్రతకాలంటే ఎంత కష్టంగా ఉందో నాకు, నిన్ను నమ్మాను అయినా ఈరోజు చూపించావు.. " అని అంది.

"సరే.. అయితే, ఇవాల్టికి నీకో వరం ఇస్తాను, నువ్వు నా స్థానం లో అమ్మోరిలా కూర్చో, నేను నీ స్థానంలో పని చేస్తాను" అని అమ్మవారు అంది. సరే అంది సంబరంగా తాయారు. "కానీ, తాయారు, రకరకాల భక్తులు వస్తూ ఉంటారు, నువ్వు ఓపిగ్గా వింటూ, ఏమి మాట్లాడకుండా జాగ్రతగా చూసుకో మరి.." అని చెప్పి అమ్మవారు, తన శక్తి తో తాయారుని తన స్థానంలో కూర్చోబెట్టి, తను మనిషిగా మారింది.   

ఈలోగా, ఒక రాజకీయ నాయకుడొచ్చాడు, "అమ్మా! నీ దయ వల్ల మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను, తల్లీ.. ఇదిగో నా కానుక.." అని సమర్పించుకుంటూ ఉండగా, లక్ష రూపాయలున్న పర్సు కింద పడిపోయింది. అతను వెళ్లి గుడి ముందు ఆగాడు. వెంటనే, ఒక రైతు వచ్చాడు, "అమ్మా! నిన్ను నమ్ముకుని పంటేసాను, అంతా పోయింది, ఇంక నేను బ్రతకను తల్లీ.. " అని అంటూ ఉండగా, ఆ పర్సు కనపడింది, "అమ్మా.. నాకోసం ఇది నీ దయే నా తల్లీ.. " అని కళ్ళకద్దుకుని వెళ్ళిపోయాడు. తరువాత ఒక మిలిటరీ సైనికుడొచ్చాడు, "తల్లీ, ఈరోజే బోర్డరుకి వెళ్తున్నాను, దీవించు.. " అంటూ అతను దండం పెట్టుకునే లోపే, పోలీసులు వచ్చి అతణ్ణి, "పర్సు కొట్టేసిన దొంగ" అని అంటున్నారు. చాలా సేపు గొడవ అయ్యాక, ఇంక ఉండలేక అంతా చూసిన తాయారు, తాను అమ్మవారి స్థానంలో ఉన్నానని మరచి, "అయ్యో !.. దొంగ అతను కాదు, రైతు అని చెప్పింది.", పోలీసులు సైనికుణ్ణి వదిలేసి, రైతుని జైల్లో పెట్టి చితకబాదారు.



అంతా చూసి, "ఆహా.. చూసావా అమ్మోరు తల్లీ, నేనెంత మంచి పని చేసానో, న్యాయాన్ని బ్రతికించాను." అంది. దానికి అమ్మవారు, "తాయారు నిజానికి నువ్వు అన్యాయం చేసావు, ఎందుకంటే, ఆ దుర్మార్గుడైన రాజకీయ నాయకుడి పర్సు రైతుకి దొరకాలనే నేను అది కింద పడేలా చేశాను.. పాపం ఆ రైతు ఇప్పుడు ఇంకా కష్టాల్లో పడ్డాడు.." అంది. "అది నిజమే తల్లీ, కానీ, సైనికుడు ఏ తప్పు చేయలేదు కదా..మరి అతనికి న్యాయం చేశాను కదా.." అడిగింది తాయారు. అప్పుడా అమ్మ, "అతనికి ఆయు గండం ఉంది, దాన్ని తప్పించుకోవాలంటే మూడు రోజులు జైలులో ఉండేవాడు, కానీ, ఇప్పుడతని ప్రయాణంలో అతనికి మరణం తప్పదు.. " అంది. అయ్యో..! ఇంత పని చేసానా తల్లీ, "నన్ను క్షమించు.." అని చెప్పి, తెల్ల మొహం వేసింది తాయారు.


"దేవత సహనం ఒక కారణానికై ఉంటుంది, అలాగే ఒక మంచితనం కూడా... , అది ఓర్పుగా ఉంది అంటే, ఒక మంచి కోసమని అర్థం, అంతేకాని, చేతగాని తనం మాత్రం కాదు.. జరిగే ప్రతి ఘటనలోనూ, ఒక అంతర్ నటన ఉంటుంది.. అది అర్థం చేసుకున్న వారిని  కష్టం ఎప్పటికీ కష్టపెట్టలేదు.. !"