Tuesday 16 July 2013

అందరూ మనుషులే..!





రోజు లాగే ఆ రోజు కూడా రజని ఉదయాన్నే లేచి పిల్లలకు పాలిచ్చి, స్కూలుకు రడీ చేస్తుండగా, పలు ఊళ్ళు తిరిగే ఉద్యోగి  అయిన తన భర్తకి అర్జంటుగా పక్కఊరు రావాలని ఫోను వచ్చింది.  నేను వచ్చేసరికి బాగా పొద్దుపోతుంది, జాగ్రత్త..  అని చెప్పి రెడీ అయ్యి బయలుదేరుతున్నాడు.  ఈలోగా, విధవరాలైన వాళ్ళ పనిమనిషి కాంతం ఎదురొస్తుంది. మడి,ఆచారాలు బాగా పాటించే రజనీ, తన భర్తని ఇంట్లోకి లాక్కొని వస్తూ, "ఏమే కాంతం విధవరాలివి కదా, అలా ఎదురురాకపొతే కాసేపు పక్కన ఉండవచ్చు కదా, వెధవ శకునం, వెధవ శకునం" అని తిట్టి, తన భర్తని మంచి నీళ్ళు తాగి వెళ్ళండి అని విసుక్కొంది. "నువ్వూ.. నీ చాదస్తం" అని భర్త విసుక్కొని నీళ్ళు తాగి వెళ్ళాడు.

వర్షాకాలం కావడంతో, జోరుగా వర్షం మొదలైంది. పిల్లల్ని స్కూలునుండి ఇంటికి తీసుకొచ్చే సమయం అవ్వడంతో, స్కూలుకి బయలుదేరింది రజని. దారిలో వర్షం బాగా పెరగడంతో,ఒక పక్కన ఆగింది.

స్కూలుకు దగ్గర్లోనే పనమ్మాయి ఇల్లు కావడంతో, ఎలాగో ఇప్పుడు కాంతం ఆంటీ మా ఇంటికి వెళ్తుంది కదా, పోనీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి కాంతం ఆంటీతో కలసి మా ఇంటికి వెళ్తాను అని అనుకొంటూ పాప పనిమనిషి కాంతం ఇంటికి వెళ్ళింది. అప్పుడు కాంతం, "బాగా వర్షం పడుతుంది కదమ్మా.. కాసేపాగి వెళ్దామా?" అని అంది. పాప సరే..  అని "మరి నాకు ఆకలేస్తోంది" అని అంది. అప్పుడు కాంతం, "అయ్యబాబోయ్ మేమేదైనా నీకు పెడితే మీ అమ్మ ఊరుకుంటుందా?," అని అంది. ఇంతలో, పాప కాంతం ఇంటికి వెళ్ళిందని, స్కూలు గేట్ మేన్ ద్వారా తెలుసుకొన్న రజనీ, కాంతం ఇంటికి వెళ్ళింది. మడి,ఆచారాలు మంట కలిపిందని పాపని తిట్టి, ఇంటికి తీసుకెళ్ళిపోయింది.

వర్షంలో తడచిన పాపకి బాగా జలుబు చేసి, జ్వరం వచ్చింది. భర్త వచ్చాక ఆసుపత్రికి తీసుకువెళ్దాం అనుకొన్న రజనికీ, "భర్తకి పని అవ్వలేదు, రేపు బయలుదేరతాడు" అని భర్త నుండి ఫోను వచ్చింది. పాపకి జ్వరం బాగా పెరిగిపోతోంది, పోనీ తను తీసుకెళ్దాం అంటే కుండపోతు వర్షం. "అయ్యో దేవుడా.. ఏం చెయ్యను?" అని ఏడుస్తుండగా, అంట్లు తోమడానికని వచ్చిన కాంతం, రజనీ ఏడవడం గమనించి, "ఏందమ్మా అట్టా ఉన్నారు?" అని అడిగింది.
ఇంక తన మడి గిడి అన్ని వదిలేసి గబ గబా కాంతాన్ని పట్టుకొని ఏడుస్తూ, "పాపకు బాగా ఒళ్ళు కాలిపొతుందే.. సమయానికి అయ్యగారు కూడా ఊర్లో లేరు, నాకు ఏంచెయ్యాలో తెలియట్లేదే" అని అంది. అది విని వెంటనే  కాంతం, "నేను ఒక డాటరమ్మగారింట్లో పని సేత్తానండి. ఆవిడ సెయ్యి చాలా మంచిది, అక్కడికి తీసుకు వెల్దామా?" అని అడిగింది. బాగా వర్షం పడ్తుంది కదే అని అంది రజని. "అదంతా మీకెందుకండి? నే తీసుకెళ్తాగా !" అని అంది.

ఆ వర్షం లోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక రిక్షాని తీసుకొచ్చి, ఆ రిక్షాలో పాపని,తల్లిని ఎక్కిచుకొని ,డాక్టరమ్మ దగ్గరకి తీసుకెళ్ళి  వైద్యం చేయించి, మందు బిళ్ళలు తీసుకొచ్చి, మళ్ళీ అదే రిక్షాలో ఇంటికి తీసుకొచ్చి దించి, "ఇక తగ్గిపోద్దిలెమ్మ,భయపడకు...  ఇక నేను వత్తానమ్మ పిల్ల ఒక్కర్తే ఉందీ.. ఎలాఉందో ఏటోనమ్మ?" అని వెళ్లబోతుంటే, రజని ఆపి, " పోనీ మీ అమ్మాయిని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చైవే ఎలాగో అయ్యగారు కూడా లేరు కదా..!" అని అంది. "మరి మీకు మడీ అవి ఉన్నవి కదమ్మ.." అని అడిగింది కాంతం.

"మనిషి కన్నా మడి,ఆచారాలు గొప్పవి కాదని తెలియ చేసాడే దేవుడు..!" అని చెయ్యి పట్టుకొని కన్నీరు కార్చింది రజని.

"మనిషిని మనిషిగా చూడటం...  ఒక మనిషిగా, ప్రతి మనిషిలో ఉండవలసిన మొదటి లక్షణం..!".






      

Friday 12 July 2013

"దేనికైనా శ్రద్ధే ముఖ్యం..."


 

 

స్వామి వివేకానంద చదువుకునే రోజుల్లో ఒకసారి జరిగిన సంఘటన... 

 

నరేంద్రుడికి పుస్తకాలు చదవటం అంటే ఎంతో ప్రియం. రోజూ కళాశాల లైబ్రరీ లో నుంచి పుస్తకాలు తీసుకెళ్ళేవాడు. అయితే, రోజూ ఒక కొత్త పుస్తకాన్ని తీసుకెళ్ళి, మరుసటి రోజు దాన్ని ఇచ్చేసి, మళ్ళీ ఒక కొత్త పుస్తకాన్ని తీసుకెళ్ళేవాడు. అక్కడ పని చేసే లైబ్రేరియన్, ఇదంతా గమనించి, ఒక రోజు నరేంద్రుని ఆపేసి, "ఏం బాబు, రోజూ ఒక పుస్తకం తీసుకెళ్తున్నావ్, ఇదేమైనా ఆటగా ఉందా ?, అసలు తీసుకెళ్ళిన ఒక పుస్తకం అయినా పూర్తి చెయ్ ముందు, ఇవాళ కొత్తది ఇవ్వను.. " అన్నాడు. బదులుగా నరేంద్రుడు, "లేదండి, ఈ పుస్తకాన్ని చూసేసాను పూర్తిగానే, నాకు కొత్తది కావాలి, దయచేసి ఇవ్వండి. " అని అడిగాడు. అప్పుడు ఆ లైబ్రేరియన్, "ఓహో..ఆ పుస్తకం పూర్తయిందా?,, సరే.. ఆ పుస్తకం ఇలా ఇవ్వు, నేను అడిగిన దానికి సమాధానం చెప్తే ఇవాళ నీకు వేరే పుస్తకం ఇస్తాను, లేదంటే ఇంక ఇవ్వను మరి.. " అన్నాడు. అప్పుడు నరేంద్రుడు, చిరు మందహాసం తో సరే అన్నాడు. 


ఆ లైబ్రేరియన్ మధ్య మధ్య పేజీలు తిప్పుతూ, నరేంద్రుని కొన్ని ప్రశ్నలు వేసాడు. అసలేమి తడుముకోకుండా అన్నిటికి నరేంద్రుడు టక టకా సమాధానాలు ఇవ్వటమే కాకుండా, అది ఎందుకో అని కూడా చెప్పేసాడు. ఇంక, ఆ లైబ్రేరియన్ కి ఆశ్చర్యమేసింది, అతని సమాధానాలకి ముచ్చటేసి, "బాబు.. ఈ పుస్తకాన్ని నిజంగానే నువ్వు పూర్తి చేసావ్, కానీ, రోజూ అన్నిటినీ కూడా ఇలాగే పూర్తి చేస్తున్నావా? " అనడిగాడు. "అవును చేస్తున్నాను, సందేహం ఉంటే మీరు అందులోంచి కూడా అడగవచ్చు.." అని చెప్పాడు నరేంద్రుడు విశ్వాసంగా. "ఇదంతా ఎలా సాధ్యం ?.. ఒక రోజులో ఒక పుస్తకం పూర్తి చేయటం మామూలు విషయం కాదు, కానీ, ఇది నీకెలా సాధ్యం అయింది?అనడిగాడు ఆ లైబ్రేరియన్. దానికి నరేంద్రుడు, "పుస్తకాన్ని అందరూ చదువుతారు, నేను చదవను, ప్రతి అక్షరాన్ని లోతుగా చూస్తాను.. ధ్యాస అంతా అందులో ఉన్నపుడు, వేరే ఆలోచన ఏదీ లేనప్పుడు, మనం చూసే ప్రతి అక్షరం సూటిగా మనల్ని తాకి, మనలోనే ఉండిపోతుంది.. పుస్తకం ఒకటనే కాదు, చేసే ఏ పనైనా శ్రద్ధ ఉన్నపుడు, ఆటకం ఉన్నా అది కంటకం కాదు.. దేనికైనా శ్రద్ధే ముఖ్యం..." అని చెప్పి కొత్త పుస్తకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక కొత్త అనుభవం ఆనందమై, ఇతని గొప్పతనం అతని విశ్వాసంలోనే ఉంది అనుకుని, వెళ్తూ ఉన్న కాంతి కిరణాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు లైబ్రేరియన్. అప్పటినుంచి, కొత్త పుస్తకాలు ఇవ్వటమే కాదు, ప్రత్యేకించి కొన్ని పుస్తకాలను నరేంద్రుని కోసం తెప్పించేవాడు కూడా.


"ఫ్రెండ్స్... వివేకానందుడు అంత గొప్ప వాడు అయ్యాడు అంటే, అది ఆయన జీవించిన విధానం, ఆయన అనుసరించిన మార్గం, ఉపదేశించిన ఆదర్శం.. ఆయన జీవితంలోని విశేషం, మనకు ఎంతో స్ఫూర్తి దాయకం...!"










Tuesday 2 July 2013

"అమ్మ..."


 

ఒక లేగదూడ, పరుగుపరుగున అమ్మ ఆవు దగ్గరికి వెళ్తూ ఉండగా, కాలు జారి పడిపోయింది, చిన్న గాయమైంది దూడ కాలికి. తల్లి ఆవు, అది చూసి, పరిగెత్తుకొచ్చి దూడని అక్కున చేర్చుకుని, గాయమైన చోట మెల్లిగా నిమురుతూ ఉంది. దూడ నొప్పితో, "అమ్మా..." అనగానే, తల్లి ఆవు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 


దూడ అది గమనించి, తల్లిని ఆనుకుని, "అమ్మా.. నొప్పి నాకైతే, నువ్వెందుకు ఏడుస్తున్నావు?" అని అంది. "నా ప్రాణం నుంచే పుట్టావు కదా తల్లీ, నీకు నొప్పిగా ఉన్నంతసేపూ నాకూ బాధగానే ఉంటుంది", అని తల్లి ఆవు అంది. అప్పుడు దూడ, "అమ్మా.. మరి నువ్వు నన్ను నీ కడుపులో దాచి మోసినప్పుడు, నీకు బరువనిపించలేదా?.." అమాయకంగా అడిగింది. దానికి తల్లి ఆవు, "లేదు తల్లీ, నా చిట్టి తల్లివి నువు  కడుపులో ఉన్నావు కదా అని మనసు తేలిక పడి, బరువంతా దిగిపోయేది" అంది.   


దూడ, "అమ్మా.. మరి నేను ఆటలాడుతున్నా, నిద్ర పోతున్నా, ఏం చేస్తున్నా, నన్నే కనిపెట్టుకుని ఉంటావు కదా, నీకు అలసటగా అనిపించదా.." అని అడిగింది. అప్పుడా ఆవు, "నా తల్లీ, నిన్ను ఎంత సేపు చూసుకున్నా నాకు తనివి తీరదు, ఇంక అలసట ఎలా ఉంటుంది చెప్పు?" అంది. చివరిగా, ఆ లేగ దూడ ఇలా అడిగింది, "అమ్మా.. ఇంత కష్టపడీ పెంచుకుంటావు, మరి రేపు నేను పెద్దయ్యాక నా దారిన నేను వెళ్లిపోతాను కదా.. అప్పుడైనా నీకు నాపై కోపం రాదా చెప్పమ్మా.." అని. ఆ ప్రశ్నకి తల్లి ఆవు నవ్వి, దూడని ఇంకా దగ్గరగా అలుముకుని, "తల్లీ, నువు పెద్దయ్యాక, నువ్వు నన్ను వదిలిపోయినా, నీ ఎదుగుదలని నేను గమనిస్తూనే ఉంటాను, నువ్వు ఎదుగుతుంటే నేను ఆనందపడతాను. ఒక తల్లిగా నీ సంతోషం తప్ప నీ నుంచి కోరుకునేందుకు ఏమీ ఉండదు." అన్నది. ఆ మాటలు విని, "అమ్మా..  ఏమిచ్చినా నీ రుణం తీరదు కదా.." అని మనసులో అనుకుని, తల్లికి దగ్గరగా ముడుచుకుని నిదురపోయింది. తల్లి ఆవు ఇంకా ఆ దూడని నిమురుతూనే ఉంది.   



సృష్టి కి మూలమే "అమ్మ"... ఏ బిడ్డ కోరేదైనా ఆ తల్లి ఒడినే కదా...
ఏ తల్లి కోరికైనా ఆ బిడ్డ క్షేమమే కదా... ఆ చల్లని "అమ్మలకు" బిడ్డల ప్రియమైన వందనం.