Monday 17 June 2013

సహానా.. !


 గ్రీసు దేశం లో సహానా అనే ఒక పన్నెండేళ్ళ పాప ఉండేది. సహానా ఓ అనాధ. తన ఆకలి తీర్చుకోవటానికి ఒక జమీందార్ దగ్గర పని చేసేది. ఆ జమీందార్ ఎంత పని చేస్తే అంతే ఇచ్చేవాడు. ఎప్పుడైనా జ్వరం వచ్చి సహానా కి బాలేకపోతే, అప్పుడైనా దయ చూపే వాడు కాదు.
 

ఇలా ఉండగా, ఒక రోజు సహానా కి జ్వరం వచ్చింది, మరెలా ?, పని చేస్తేనే కానీ ఆ రోజు ఆమెకి తిండి ఉండదు. అయినా ఇంకేమీ చేయలేక పనికి బయల్దేరింది. దారిలో ఒక చోట, ఒక పెద్దాయన ఊళ్ళో అందరికి యాపిల్ పళ్ళు పంచుతున్నాడు. హమ్మయ్య! ఈ పూటకి ఒక పండు తినేసి ఇవాళ కొంత విశ్రాంతి తీస్కుని, రేపు మళ్ళీ పనికి వెళ్దాం అనుకుని, ఆ లైనులో నిలబడింది. పాపం, జ్వరం ఉండటం వల్ల చాలా నీరసంగా ఉంది సహానా కి. అయినా ఇంక తప్పదు అని అలాగే లైనులో నిల్చుంది. ఎంతో సేపు ఎదురు చూడగా, తనకి పండు తీసుకునే అవకాశం వచ్చింది. సహానా చేతిలో ఆ పండు పెడుతుంటే, అది జారి పడిపోయింది. కింద పడగానే, ఒక కోతి వచ్చి ఆ పండుని కాస్తా ఎగరేసుకు పోయింది. సహానా, ఆ పెద్దాయన్ని ఇంకో పండు ఇవ్వమని అడిగింది. దానికాయన, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాను, అది పడిపోయింది అన్నాడు. అది నా తప్పు కాదు కదా అన్నది సహానా. సరే, నీ తప్పు లేదు కనుక నీకు పండు ఇస్తాను, కానీ, అందరూ నీలాగే ఆకలితో ఎదురుచూస్తున్నారు, కాబట్టి, నువ్వు వెళ్ళి మళ్ళీ లైనులో నిలబడు, నీ అవకాశం వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడు. ఇంక వేరే దారి లేక, సహనా పాపం మళ్ళీ వెళ్ళి అందరికన్నా చివర్లో నిల్చుంది. 

బాగా ఆకలిగా ఉంది సహానాకి, ఓపిక అసలే లేదు, ఒక వైపు కళ్ళు తిరుగుతున్నాయి, అయినా, ఆ పండు తింటేనే తన ఆకలి తీరుతుంది అని తెలుసు, అందుకే ఎంత కష్టంగా ఉన్నా అలాగే ఎదురు చూస్తూ ఉంది. కొన్ని గంటల తర్వాత తన అవకాశం వచ్చింది. ఈసారి, ఆ పెద్దాయన పండుని జాగ్రత్తగా ఆమె చేతిలో పెట్టి ఇలా  అన్నాడు, "ఈ పండు అప్పుడే ఇస్తే సరిపోయేది కదా అని నీకు అనిపిస్తుంది కదా ?" అని, దానికి సహానా, అవును అంది. ఆయన ఆమె పేరు అడిగి తెల్సుకుని ఇలా అన్నాడు, "సహానా!, ఇక్కడ ఇంత మంది ఉన్నారు, అందరు పండు కోసం ఆశ పడి వచినవాళ్ళు, కానీ, నువ్వు ఆ పండు వల్ల నీ ఆకలి తీరుతుందని వచ్చావు, నీ పరిస్థితి బాలేదని నాకు తెల్సు, అందుకే నేను మొదటి సారి పండు ఇచ్చినప్పుడు కావాలనే, ఆ పండు కింద పడేలా ఇచ్చాను, ఎందుకంటే ఆ పండు బాలేదు, పాడైపోయింది. ఇప్పుడు నీకు ఇస్తున్న ఈ పండు, అన్నిటికన్నా స్వచ్చమైనది, మహిమ గలది. ఇక్కడ అర్హత ఉన్నవాళ్ళకి దీన్ని ఇవ్వాలని ఈ ఊరికి వచ్చాను, నువ్వు ఒకసారి కోల్పోయినా ఇంకా దానికోసం ఎంత కష్టమైనా ఎదురు చూసావు, చిన్నదానివైనా నీ ఓపిక తో దీన్ని నువ్వు సొంతం చేసుకున్నావు, ఈ పండు తిని ఐదు వరాలు కోరుకో, అవన్ని తీరుతాయి" అని చెప్పి ఆశీర్వదించి  వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన. సహానా సంతోషించి, పండు తిని, ఐదు వరాలు కోరుకుని, ఇంక తన జీవితాన్ని ఆనందమయం చేసుకుంది. 

1 comment: