Tuesday 25 June 2013

"నిజమైన మనిషి..."

 

 

 

నిశ్శబ్దంగా ఉంది ఆ సమయంలో మియాపూర్ బస్ స్టాపు.. పక్కనే ఒక ప్రేమ జంట, కబుర్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. స్టాపులో ఒకావిడ ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉంది. అంతలో, దూరం నుండి మెల్లగా నడవలేక నడుస్తూ, ఒక మనిషి రావడం గమనించారు వాళ్ళు. అతను నడి వయసులోనే ఉన్నాడు, కానీ, చర్మం అంతా కాలిపోయి, కమిలిపోయి వికారంగా కురూపిలా ఉన్నాడు. 

అతను వీళ్ళ దగ్గరే వచ్చి నిలబడతాడో ఏమో అని అందరూ లోలోపలే అనుకుంటున్నారు, అతను ఆ ప్రేమ జంట పక్కనుండే వెళ్తుంటే, ఆ అమ్మాయి "ఛి ఛి రాజు, ఇలాంటి వాళ్ళు తిరుగుతున్న చోటికి తీసుకొచ్చావా నన్ను, చూడు ఎంత అసహ్యంగా ఉన్నాడో, త్వరగా బస్సు వస్తే బాగుండు.. ", అటు పక్క నిల్చుందాం పద అని అతన్ని లాక్కెళ్ళింది వేరే వైపు. ఆ కురూపి ఆ మాటలు విన్నా, పట్టించుకోక వెళ్లి, బస్సు కోసం ఎదురు చూస్తూ స్టాపులో నిలబడ్డాడు. అక్కడున్న ఆవిడ కూడా, అసహ్యంతో దూరం జరిగింది అతనికి. అయినా, ఆ కురూపి ఒక చిరునవ్వు నవ్వుకుని మౌనంగా ఉండిపోయాడు. 

ఇంతలో, స్టాపులో నిలబడ్డ ఆవిడ కూతురు వచ్చింది, చేతిలో ఫైల్ పట్టుకుని, "అమ్మా ! నేను ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాను, చూడు నా జాయినింగ్ లెటర్... " అంటూ, చూపించబోతుంటే ఆ లెటర్ గాలికి ఎగిరి రోడ్డుపై పడింది. "అమ్మో ! నా జాబ్, నా లెటర్...." అంటూ, ఆమె కూతురు రోడ్డు పైకి పరిగెత్తింది. అప్పటికే అటువైపు నుండి ఒక పెద్ద లారీ వస్తోంది స్పీడుగా, ఆ అమ్మాయి అది గమనించలేదు, పైగా ఆ లెటర్ గాలికి ఎగిరిపోతూ ఉంది. అక్కడున్న ప్రేమ జంటలో అబ్బాయి, వెనకనుండి లారీ వస్తున్న విషయం గమనించి, అక్కడి నుండే ఆమెని కేకేసాడు, ఆమె విన్పించుకోలేదు,.... ఆ లారీ ఆమెకి చాలా దగ్గరగా వచ్చేసింది, అప్పుడు చూసింది ఆ అమ్మాయి.. "అమ్మా..... " అరిచింది. 

 కొన్ని క్షణాల్లో ఆమె ప్రాణం పోయేది, కానీ, ఓ చేయి ఆమెని పట్టి ఇవతలకి లాగింది, ఆ చేయి అక్కడికి వచ్చిన కురూపిది. ఆ వికారి ఆమె ప్రాణం కాపాడాడు, అందరూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఆ అమ్మాయి వచ్చి, ఆ కురూపిని హత్తుకుని, అతనికి కృతజ్ఞతగా ఒక ముద్దు పెట్టింది. అది చూసి, ఆమె తల్లి, ఆమెని లాగేసి, "ఏంటే, వాడికి ముద్దు పెడుతున్నావ్, ఎన్ని రోగాలున్నాయో యేవిటో,, ఛి ఛి.. " అంది, దానికి ఆ అమ్మాయి, "అమ్మా, ఎలా ఉన్నా, ఆయన నా ప్రాణం కాపాడాడు, అతనికి కనీసం థాంక్స్ చెప్పకుండా అలా అంటావేంటి?..  " అంటూ ఉండగా,.. అక్కిడికి ఒక మిలిటరీ వ్యాను వచ్చి ఆగింది. అందులోంచి, ఇద్దరు దిగి, ఆ కురూపి దగ్గరికి వచ్చి, సెల్యూట్ చేసి, "సారీ సార్, లేట్ అయ్యింది.. " అని ఆయన్ని వ్యానులో తీసుకెళ్ళారు. అక్కడున్న ఆ నలుగురూ, ఆ వ్యానులోంచి దిగిన ఒక అతణ్ణి అడిగారు, ఎవరతను? అని, అతనిలా చెప్పాడు, "ఆయన మిలిటరీ మ్యాన్, 6 నెలల క్రితం, ఒక చోట బాంబు పెట్టారని వెళ్లి, దాన్ని డిఫ్యూస్ చేస్తూ ఉండగా, అది పేలింది, ఎంతో మంది ప్రాణాలు కాపాడిన, ఆయన్ని మేము కష్టపడి బ్రతికించుకున్నాం, హి ఇస్ ఎ రియల్ హీరో... " అని వెళ్ళిపోయాడు. 

అంతా విని, తమ ప్రవర్తనకి సిగ్గుపడి, వాళ్ళు తల దించుకున్నారు. అప్పుడు ఆవిడ కూతురు అంది, "అమ్మా!.. కాళ్ళూ, చేతులూ, శరీరం ఏదీ బాలేకున్నా, వాళ్లకు ఏమీ కాని మన ప్రాణాలను కాపాడుతున్నారు... కానీ మనం, అన్నీ ఉండీ, కనీసం ఒక మనిషిని మనిషిగా అయినా ఆదరించటం లేదు. ఆయన కాపాడినందుకే నా ప్రాణానికి విలువ పెరిగింది, ఆయనకి నా హృదయ పూర్వకమైన నమస్కారం... "... అంతా అలాగే నిశ్శబ్దంగా ఉంది.. కానీ, ఒక చిన్న ఆలోచన మొదలైంది... 

 

దేశం కోసం,దేశంలోని ప్రజలకోసం వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే సైనిక సొదరులకి మా కధ అంకితం.

 

 

 

No comments:

Post a Comment