Wednesday 26 June 2013

"దేవుడంటే సాయం.."






ఆనంద రాజు పరమ భక్తుడు. కుటుంబంతో కలిసి తీర్థ యాత్రకు వెళ్ళాడు, భగవంతుని సందర్శించుకుని, తిరుగు ప్రయాణం అవుతూ నది దాటుతుండగా... ఒక్కసారిగా నది ఉధృతి పెరిగింది, వరదలా పొంగింది. వీళ్ళ బస్సు ఆ లోయల్లో చిక్కుకుపోయింది. ఆ చోట మాత్రమే కాదు, ఆ తీర్థస్థలం చుట్టురా ఉన్న ఊళ్లల్లోకి నీళ్ళు నిండి, అంతా నీటి మయం అయిపోయింది. అంతవరకూ, నిర్మలంగా ఉన్న ఆ లోయల అందాలు, ఒక్కసారిగా భయంకరంగా మారిపోయాయి. 

బస్సులో ఇరుక్కుపోయిన ఆనంద రాజు, అంతా ఆ భగవంతునిపై భారం వేసి, దేవుణ్ణి తలుస్తూ ఉన్నాడు. ఇంతలో, రక్షణ సిబ్బంది వచ్చారు, హుటాహుటిన అందర్నీ కాపాడే పనిలో మునిగి పోయి ఉన్నారు. ఆ సిబ్బందిలో ఒక జవాను ఉన్నాడు, పేరు బద్రీనాథ్. పరమ నాస్తికుడు. కానీ, భక్తుల్ని కాపాడుతూ, తన రక్షణ బాధ్యతని పూర్తిగా మనసుతో నిర్వహిస్తున్నాడు. 

ఆనంద రాజు, అందర్నీ గమనిస్తూ ఉన్నాడు. కొందరు దేవుడా, దేవుడా అని వేడుకుంటున్నారు. కొందరు భయపడుతూ, ప్రాణాలు అరచేత బట్టి కదలక ఉండిపోయారు, కొందరు ఆ దేవుణ్ణే నిందిస్తున్నారు, "నీ దర్శనానికి వచ్చిన వాళ్ళనే శిక్షిస్తున్నావా?.." అని. కొందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, బంధువుల రోదన... గాయాలైన వారి ఆర్తనాదాలు... ఇలా అన్నీ. 

ఇంతలో, కొన్ని పార్టీల రాజకీయ నాయకులు వచ్చారు. అక్కడైనా, ఒక మనిషి ప్రవర్తన లేదు వాళ్ళలో. ఒక్కర్నీ కాపాడింది లేదు, కానీ, మా పార్టీ అంటే మా పార్టీ గొప్పదని పోట్లాడుకుని, బాధితులను ఆనుకుని నాలుగు ఫోటోలు , రెండు వీడియోలు తీయించుకుని వెళ్ళిపోయారు. 

ఇంక, బద్రీనాథ్ కొందరితో కలిసి వచ్చాడు, ఆనందరాజు ఉన్న బస్సులో వాళ్ళని కాపాడటానికి. బస్సులో వాళ్ళు హమ్మయ్య ఇప్పటికైనా సాయం అందిందని ఊరటగొన్నారు. అందర్నీ కాపాడారు. చివరగా ఆనందరాజు, బద్రీనాథ్ మిగిలారు అందులో. బస్సు లోయలోకి పడిపోయేలా ఉంది, బస్సులో వెనకాల ఉన్నారు ఇద్దరూ, ఆనందరాజుకి సాయం అందిస్తూ ఉన్నప్పుడు, మెళ్ళో రుద్రాక్ష దండ జారి పడిపోయింది, దానికోసం ఆనందరాజు మళ్ళీ వెనక్కి వెళ్దామని ప్రయత్నిస్తుంటే, బద్రీనాథ్ వారిస్తూ, "ప్రాణం కన్నా ఆ దండ ఎక్కువా మీకు ?, పదండి... లేదా బస్సు జారిపోతుంది లోయలోకి.. ఇద్దరం పడిపోతాం.. ". అప్పుడు ఆనందరాజు అన్నాడు, "నా ప్రాణాలు ఆ భగవంతుడి చేతి లోనే ఉన్నాయి, పడిపోతే ఆయన దగ్గరికే వెళ్తాను, ఫరవాలేదు.. ", ఆ మాటలకి బద్రీనాథ్ కి కోపం వచ్చింది, "మీ ప్రాణాలంటే మీకు లెక్కలేదు, కానీ, నాకు ఇంకా ఎంతో మందిని కాపాడవలసిన బాధ్యత ఉంది, పదండి ముందు.. ఆ దేవుడొచ్చి కాపాడతాడా ?" అని. అది ఆనందరాజు వినీ, "వచ్చాడు ఆ దేవుడు.. మీ రూపంలోనే" అన్నాడు. బద్రీనాథ్ ఆనందరాజు ముఖాన్ని చూసి, వెళ్లి ఆ రుద్రాక్ష దండ తెచ్చి ఇవ్వబోతుంటే బస్సు మరింత లోతుకి జారింది. అప్పుడు ఇద్దరి పట్టుతప్పి, జారిపోతూ చెరొక కడ్డీ పట్టుకుని వారి వారి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇంతలో, జారుతున్న ఆ బస్సు ఒక రాయికి తగిలి, పడిపోకుండా ఆగింది. ఇద్దరూ మెల్లిగా బైటపడే ప్రయత్నం చేసారు. బద్రీనాథ్ చేతిలో రుద్రాక్ష అలాగే ఉంది, ముందు తను బైటపడి, ఆనందరాజుని కాపాడాడు. ఇద్దరూ బైటికొచ్చి చూద్దురు కదా!, "ఆ రాయికి బురదతో ఉన్న ముద్రలు నామాలుగా కనపడుతున్నాయి. "

ఆనందరాజు ప్రేమగా బద్రీనాథ్ చేయి పట్టుకుని, కృతజ్ఞతతో కళ్ళకి అద్దుకుని, ఇలా అన్నాడు, "మేము మనసులో భగవంతుణ్ణి ప్రార్థించి, ఆయన కాపాడతాడని  నమ్ముతాము.. మీరు, ఆ భగవంతుని అవతారాలై మమ్మల్ని కాపాడుతున్నారు.. ఆపదలో ఆ దేవుడు కాపాడతాడని నమ్మిన మా నమ్మకాన్ని నిజం చేసేందుకే , మీ రక్షకుల రూపంలో ఆ దేవుడే వచ్చాడు" అని అన్నాడు. అప్పుడు  బద్రీనాథ్ అన్నాడు ఇలా, "దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలీదు, నా వృత్తి నా దైవం అంతే.. " అని, ఇంకొందర్ని కాపాడేందుకు పరుగు పరుగున వెళ్ళిపోయాడు. 

"ఒక ఆస్తికుడు ఆపదలో కూడా దేవుణ్ణే నమ్మాడు... ఆ దేవుణ్ణి నమ్మని నాస్తికుడు కూడా ఆ దేవుడి రూపం అయ్యాడు."

"దేవుడంటే సాయం.. ఆ సాయాన్ని తమ బాధ్యతగా అనుకుని, ఉత్తరాఖండ్ వరద బాధితుల్ని కాపాడుతున్న ప్రతి రక్షణ సిబ్బందికి, సాయానికి వెనుకాడని ప్రతి బాధ్యత గల పౌరుడికి, మనఃపూర్వక సెల్యూట్.."

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment