Saturday 29 June 2013

వెంగళప్ప పందెం కాచాడోచ్...





కిరణ్, వెంగళం ఇద్దరూ ఫ్రెండ్స్. ఒకసారి, ఈ వెంగళప్ప ని ఆట పట్టిస్తూ కిరణ్, "ఒరే నువు నిజంగా వెంగళప్పవే రా..." అన్నాడు. దానికి, వెంగళానికి చాలా కోపమొచ్చింది. "ఊహు.. నేనేమి వెంగళప్పని కాదు, నా పేరు మాత్రమే వెంగళం.." అన్నాడు మూతి ముడుచుకుని. అప్పుడు కిరణ్, "అయ్యో..! సన్నాసీ, కావాలంటే నీకు నిరూపిస్తాను చూడు" అని చెప్పి, "సరే ఒక పందెం కాద్దామా?..." అనడిగాడు.  


సరే అన్నాడు వెంగళం. కిరణ్ ఇలా చెప్పాడు, "పందెం ఏంటంటే, నేను నీకు ఒక అమ్మాయిని చూపిస్తాను, నువు గనక ఆ అమ్మాయిని నెలరోజుల్లో ప్రేమలోకి దింపితే, నువు వెంగళప్పవి కావు, అలా కాకుండా, ఆమె నిన్ను కాదంటే నువు వెంగళప్పవే.." అన్నాడు. "సరే, ఆ అమ్మాయిని చూపించు, ఇట్టే పడేస్తా..." అన్నాడు వెంగళం హుషారుగా.   


ఆ అమ్మాయిని చూపించి, ఆమె పేరు ప్రియ అని చెప్పి, నెల రోజుల తర్వాత కలుద్దాం అని వెళ్ళిపోయాడు కిరణ్. 


ఇంక మన వెంగళం రంగం లోకి దూకాడు, వెనకాల మ్యూజిక్ తో, "ఈ దూకుడూ... సాటెవ్వడూ" అని. ఆ అమ్మాయిని గమనిద్దాం ఏయే టైం లో ఎక్కడుంటుంది అని, స్కెచ్ వేసి, ఒక చార్ట్ తయారు చేసుకున్నాడు. ఉదయం.. 9 గంటలకి, అమ్మోరి గుడిలో... ప్రియ గుడికొచ్చింది. ఆమె కొబ్బరి కాయ తీస్కుంది. వెంగళమూ కొబ్బరికాయ తీస్కున్నాడు. ఆమె కొబ్బరికాయ పగులకొట్టి, దండం పెట్టింది. మన వాడూ, కొబ్బరికాయ కొట్టాడు. పాపం  దండం పెట్టుకుందాం అనుకునేసరికి వెంగళం చెంప ఛెళ్ళుమంది. ఏమైందా అని చూస్తే, ఎదురుగా ప్రియ, "వెధవ,,, కొబ్బరికాయ చూసి కొట్టలేవా?.. నా తల పగులకొట్టావ్.." అంటూ రుసరుసగా వెళ్ళిపోయింది. బిక్క మొహమేసి, "ప్రియా... నన్ను క్షమించు ప్రియా... " అని లోలో అనుకుని తానూ వెళ్ళిపోయాడు. 

 

తరువాత రోజు సాయంత్రం 6 గంటలకి... ప్రియ కాఫీ షాపుకి వచ్చింది, ఒక కాఫీ ఆర్డరు చేసింది. వెంగళమూ కాఫీ ఆర్డరు ఇచ్చాడు. ఆమె ముందు కొంచం బిల్డప్ ఇద్దామని, బేరర్ కాఫీ తెస్తుంటే, "ఇదిగో చిన్నా.. నీకెందుకు శ్రమ? కాఫీ నేను తెచ్చుకుంటాలే.. " అని వెళ్లి కాఫీ తెస్తుండగా, అది కాస్తా ప్రియ పై పడి, ఆమె డ్రెస్ అంతా పాడయింది. ఇంకేముంది, వెంగళం చెంప మళ్ళీ పగిలింది. 

 

"ఒరే వెధవ.. బేరర్ ఉండేదే సర్వు చేయటానికి.. ఇలా నువ్వు తెచ్చుకుని పక్కనోళ్ళను కాఫీ లో ముంచటానిక్కాదు.. ఛీ, మంచి డ్రెస్సు నాశనం చేసాడు యెదవ.. " అని మళ్ళీ కోపంగా వెళ్ళిపోయింది. వెంగళం ఇంకా షాకు నుండి తేరుకోలేదు... 

 

ఇలా రోజూ ఏదో ఒక విధంగా ప్రియ దృష్టిలో పట్టానికి ఏదో చేసి, అది ఇంకేదో అయ్యి, మొత్తంగా 29 చెంపదెబ్బలు తిన్నాడు. ఇక చివరి 30 వ రోజు, ఇంక లాభం లేదని, డైరెక్ట్ గా "ఐ లవ్యూ.." చెప్పేద్దామని, ఒక రోజా పువ్వుతో, ఆమె పక్కింటి పిట్ట గోడ మీద నిలబడ్డాడు. ప్రియ వచ్చింది. ఆమెకు పువ్వు ఇద్దామన్న తొందరలో, ఎగిరి ఆమె కాళ్ళ ముందు పడ్డాడు. కాళ్ళకి మెట్టెలున్నాయి, ఎవరోలే అనుకుని లేచాడు. లేచేసరికి చెంప మళ్ళీ మోత మోగింది. ఈసారి ఎదురుగా ఎవరో ఒకతను ఉన్నాడు, "ఏవండి.. నేను చెప్పా కదా నెల్రోజులుగా రోజూ ఒకడు నన్ను బాగా టార్చర్ పెడుతున్నాడని.. వీడే వాడు.. " అంది ప్రియ. "ప్రియ.. నీకు పెళ్లయిపోయిందా? ఎప్పుడు ?.." అన్నాడు షాకులో షేక్ అయిన వెంగళం. "పెళ్లయిపోయిందా ఏంట్రా వెధవ ?.. ఇద్దరు పిల్లలు కూడా ఉంటే.. ఈసారి మళ్ళీ కనపడితే చంపేస్తాను వెధవ " అని కోపంగా ప్రియ వాళ్ళ ఆయనతో వెళ్ళిపోయింది. 

 

అప్పుడే అక్కడికొచ్చి అంతా చూస్తూ ఉన్న కిరణ్, ఫక్కుమని నవ్వాడు. వెంగళం కోపంగా కిరణ్ దగ్గరికొచ్చి, "ఒరే.. ఇది చీటింగ్ రా.. ఆ అమ్మాయికి ముందే పెళ్లి అయిపొయింది.. నీకు తెలిసీ నాకు ఆ అమ్మాయిని చూపించావు కదా.. " అన్నాడు. అప్పుడు కిరణ్, "నీ మొహం.. నేను చూపించినప్పుడే ఆవిడ వాళ్ళ ఆయన, ఇద్దరు పిల్లలతో నే ఉంది. నువ్వు చూళ్ళేదా?" అన్నాడు. 

 

అప్పుడు వెంగళం, "అవునా.. ఏమో? ఎలాగైనా పందెం గెలవాలని ఆ అమ్మాయి పైనే ఫోకస్ చేసారా.." అన్నాడు. "హ హ్హ హ్హ అందుకేరా, నిన్ను వెంగళప్ప అన్నాను... " అని వెళ్ళిపోయాడు కిరణ్. "హ్మ్... జగమే మాయ.. బతుకే మాయ..." అని పాడుకుంటూ బిక్క మొహమేసాడు వెంగళం.

 

 

 

 

 

 

No comments:

Post a Comment