Monday 10 June 2013

మనసుతో మనువు...

మనసుతో మనువు...



అబ్బాయి: హేయ్! నీ పేరేంటి?
అమ్మాయి: ఎవర్నువ్వు? నువ్వెవరో తెలికుండానే పేరు చెప్పాలా?
అబ్బాయి: సరే, నా పేరు శశి.
అమ్మాయి: హా ఐతే ఏంటి?
అబ్బాయి: ఇప్పుడు నేనెవరో తెల్సింది కదా, ఇప్పుడైనా నీ పేరు చెప్పు. ప్లీజ్...
అమ్మాయి: ఓహో! ఐనా ఎందుకు చెప్పాలి?
అబ్బాయి: నువ్ నాకు నచ్చావ్ కాబట్టి. రేపు మన పెళ్ళి అవ్వొచ్చు, నిన్ను పేరు పెట్టి పిలవకుండా ఎలా పిలవాలి? ఐనా ఫరవాలేదు, కానీ, అందరి ముందూ నిన్ను బంగారూ అని పిలవలేను కదా బంగారం..!
అమ్మాయి: ఆగు ఆగు ఒక్క నిమిషం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా?
అబ్బాయి: అవును నిజం మాట్లాడుతున్నాను.
అమ్మాయి: ఏంటి నిజం? ఇలా రోడ్డుపై ఎవరినిపడితే వాళ్ళని పట్టుకుని పెళ్ళి గిళ్ళి అని అనేవాళ్ళని పిచ్చోళ్ళనే అంటారు.
అబ్బాయి: నిజమే కదా. నాకు నువ్వంటే పిచ్చి. నీ పేరు చెప్పు బంగారం వినాలని ఉంది.
అమ్మాయి: అబ్బా! అసలే నా బాధలో నేనుంటే నీ గోల ఏంటి? ప్లీజ్, విసిగించకు, వెళ్ళిపో.
అబ్బాయి: నీ బాధ పొగొట్టేందుకే నేను వచ్చాననుకో. ఏమైందో చెప్పు..
అమ్మాయి: సరె విను, సాయంత్రం మా ఇంట్లో నాకు పెళ్ళిచూపులు. చాలా!.. ఇప్పటికైనా వదిలెయ్ ప్లీజ్..
అబ్బాయి: పెళ్ళి చూపులా? ఐతే, నిన్ను ఒప్పించుకోటానికి నాకు ఇంకా ఈ ఒక్క పూటే ఉందా?
అమ్మాయి: అయ్యో! దేవుడా... నాకేంటి ఈ బాధ. (అంటూ చిరాగ్గా వెళ్ళిపొతోంది)
అబ్బాయి: (వెళ్తున్న ఆమె ముందుకొచ్చి అంటున్నాడు) సరే ఇంక బాధ పెట్టను, కానీ, ఒక్క మాట... నీ తల్లిదండ్రులు తీస్కొచ్చిన వాడు, నీ వయసుని అందాన్ని ఆస్తిని మాత్రమే ప్రేమించగలడు. అది కొంత కాలం మాత్రమే మిగిలి ఉంటుంది. నీ మనసుని వలచిన నాతో జీవితకాలం అంతా సుఖంగా ఉంటావు. మనసుని గెలిచిన వాడితో నూరేళ్ళు సుఖంగా ఉంటావో, లేక, నీ అందం వలచిన వారితో కొంతకాలమే సుఖంగా ఉంటావో నీ ఇష్టం.. నాతో ఉంటే ప్రతి క్షణం నువు మరువలేని ఙ్ఞాపకాలు బహుమతిగా ఇస్తాను.
(ఆ మాటలు ఆ అమ్మాయిని తాకాయి, కానీ, ఆమె బదులు వినకుండానే అతను వెళ్ళిపోయాడు)
ఎవరతను అసలు.. అని అతని గురించే అలోచిస్తూ ఇంటికెళ్ళింది ఆ అమ్మాయి,,, పెళ్ళి చూపులకి వచ్చిన వాళ్ళకి టీ ఇద్దామని తల ఎత్తింది,, అంతే, ఎదురుగా ఉన్న అబ్బాయి అతనే.. తను ఏమి మాట్లాడలేక లోపలికెళ్ళిపొయింది... అప్పుడతను వచ్చి ఆమెతొ అన్నాడు.. పెళ్ళంటే ఏ అమ్మాయికైనా చాలా భయాలూ ప్రశ్నలూ ఉంటాయి, నువ్వు నన్ను అలాంటి భయంతో చేస్కొవటం కన్నా ప్రేమతో చేస్కోవాలి అనే అలా మధ్యాహ్నం వచ్చి సరదాగా పరిచయం చేస్కున్నాను, సారీ!... అంతా విని,
ఆ అమ్మాయి సిగ్గుపడి నవ్వుతూ అతని కళ్ళని చూస్తూ అవునని చెప్పకనే చెప్పింది.
అబ్బాయి: ఇప్పటికైనా నీ పేరు చెప్తావా మరి?...
అమ్మాయి: బంగారం నా పేరు... పిలుచుకో అలాగే !
అబ్బాయి: ?!...... హ హ్హ హ్హ ...

No comments:

Post a Comment